బాధాకరం.. అలీ సూసైడ్

by Anukaran |
బాధాకరం.. అలీ సూసైడ్
X

దిశ, నర్సంపేట: కరోనా వల్ల జరిగే నష్టం కన్నా ‘కరోనా పాజిటివ్’ అన్న రిపోర్ట్ బయటికి రావడంతో జరిగే నష్టం ఎక్కువవుతోంది. బాధిత కుటుంబాల్లోనే కాకుండా కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. ఇప్పుడు నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు సగం కన్నా ఎక్కువ మందికి ఎలాంటీ లక్షణాలు ఉండటం లేదు. వీరందరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, హోం ఐసోలేషన్ లో ఉండొచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే బాధితుల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తూ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే… నల్లబెల్లి మండలంలోని మేడపల్లి కి చెందిన మహబూబ్ అలీ(33) అనే వ్యక్తి కుటుంబంతో సహా నర్సంపేటలోని ఇంద్రనగర్ లో అద్దెకు ఉంటున్నాడు. ఎం.బీ.ఏ చేసిన అలీ ప్రస్తుతం ఐడియా కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల కిందట స్థానికంగా రాపిడ్ టెస్ట్ చేసుకున్న ఆలీకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సున్నిత మనస్కుడు అయిన అలీ ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పాజిటివ్ వచ్చిన వారి పట్ల ఇతరులు వ్యవహరిస్తున్న తీరు అతన్ని మరింత కృంగదీసింది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

పట్టణం అంతటా గాలించినా అతని ఆచూకీ దొరకలేదు. గురువారం రాత్రి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన గల బావిలో అలీ మృతదేహం లభ్యం అయింది. అందరితో సరదాగా మెలిగే అలీ మృతితో అటు మేడపల్లి, ఇంద్రానగర్ లో విషాదం నెలకొంది. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల్లో మనోస్థైర్యాన్ని నింపేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story