రెవె‘న్యూ’ యాక్ట్‌తో కబ్జాలకు చెక్..

by Anukaran |
రెవె‘న్యూ’ యాక్ట్‌తో కబ్జాలకు చెక్..
X

దిశ, న్యూస్‌బ్యూరో: ‘‘ఒక్క రోజులో చట్టాలు రాలేదు. కాలక్రమేణా వచ్చాయి. 87 చట్టాలతో తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం 2020 అమలు చేస్తాం. ఆర్వోఆర్‌లో ధరణి సర్వస్వం కాదు. కన్ క్లూజివ్ టైటిల్ దిశగా అడుగులు వేస్తున్నాం. కొంత సమయం పడుతుంది. అధునాతన టెక్నాలజీ వచ్చింది. డిజిటల్ సర్వే చేపడుతాం. లిటిగేషన్లు అత్యల్పం. జాగీర్ రద్దు, ఇనాం రద్దు వంటివి వచ్చాయి. వాడు ఇచ్చిండు.. వీడు ఇచ్చిండు అంటూ వస్తనే ఉన్నరు. ఎంత కాలం ఇది? ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తీసుకొస్తనే ఉన్నరు. ఇలాంటి కబ్జాలకు చెక్ పెట్టాలని కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బిల్లులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు.

రెవెన్యూ శాఖ మనదేనని, వారు 50 రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. తహశీల్దార్లను నమ్మకపోతే మరెవరిని నమ్ముతామన్నారు. కొందరే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కుటుంబ సభ్యులకే అధికారాలు ఇస్తున్నాం. వారి నిర్ణయం మేరకు పౌతి చేసే చట్టాన్ని రూపొందించామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులెవరైనా రాకపోతే తహశీల్దార్ కు ఫిర్యాదు చేయాలి. లేదంటే కోర్టుకు వెళ్లాలి అని అన్నారు. వారసత్వ సమస్యలేవీ తలెత్తకుండా ఉంటుందన్నారు. వివాదాలు లేకుండా విశ్వప్రయత్నం చేస్తాం. ఇది విప్లవాత్మక చట్టం. ప్రజలకు మేలు జరుగుతుంది. వివాదాలు తగ్గుతాయని అన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వినతి మేరకు అప్పటికప్పుడే బండ్లగూడ ఏరియాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

రైతుబంధు పక్కాగా అమలు..

రాష్ట్రంలో 1,45,58,000 ఎకరాల భూమికి, 57,90,000 మంది రైతులకు రైతుబంధు కింద రూ.7,279 కోట్లు అందించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 48 గంటల్లోనే వారి ఖాతాల్లో పడ్డయ్. ఎక్కడా ఏ చిన్న ఫిర్యాదు రాలేదు. మార్పును సులభంగా అంగీకరించరు. పొజిషన్లో తక్కువ, రికార్డులో ఎక్కువ ఉన్న కేసుల పరిష్కారం కావాలంటే సర్వే చేయాల్సిందే. గతంలో అసైన్మెంట్ భూములపై చాటలో తౌడు పోసి కుక్కలను కొట్టుకొమ్మని చెప్పారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఉన్న భూమి కంటే అత్యధికం పంచిపెట్టారు. రాజకీయ అవసరాలుగా మార్చారు. వీటికి సమగ్ర సర్వే మాత్రమే పరిష్కారమన్నారు.

వక్ఫ్, దేవాదాయ భూములు సీజ్..

వక్ఫ్ భూముల రక్షణకు ఏ పార్టీ శ్రద్ధ పెట్టిందో అందరికీ తెలుసునని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గెజిట్ ప్రకారం 77,538 ఎకరాలు ఉంది. 57,423 ఎకరాలు కబ్జాకు గురైంది. దేవాదాయ శాఖకు సంబంధించి 87,235 ఎకరాలు ఉండగా 27 వేల ఎకరాలు లీజుకు ఇచ్చారు. 23 వేల ఎకరాలు అర్చకుల పేరిట ఉంది. 19 వేల ఎకరాలు గుట్టలుగా ఉంది. వీటిలోనూ ఆక్రమణలు ఉన్నాయి. వీటన్నింటినీ కాపాడుతాం. అందుకే వీటిని రేపటి నుంచే ఆటో లాక్ చేస్తున్నం. 100 శాతం రిజిస్ట్రేషన్లు ఉండవు. మున్సిపల్ పర్మిషన్లు ఉండవు. ఎన్వోసీలు ఉండవు అని చెప్పారు.

ఆర్వోఆర్ఎఫ్ భూముల నేచర్ మారదు. అటవీ శాఖకు యాజమాన్య హక్కులు ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారదన్నారు. ధరణిలో పోర్టల్లో ప్రత్యేకంగా ఆయా రైతుల పేర్లను నమోదు చేస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే 11.19 లక్షల ఎకరాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 6.18 లక్షల ఎకరాలు చేసేశాం. మరోసారి అవకాశం ఇవ్వాలని శాసనసభ్యులు అడుగుతున్నారు. జీఓ 58, 59 లకు మరో అవకాశాన్ని కోరుతున్నారు. కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఓ 15 రోజుల పాటు అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో సారి అవకాశం ఉండదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed