తహసీల్దార్ నాగరాజు ఆస్తులపై నిఘా

by Anukaran |   ( Updated:2020-08-16 11:59:28.0  )
తహసీల్దార్ నాగరాజు ఆస్తులపై నిఘా
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజు బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. సుమారు 20ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ సోదాల్లో నాగరాజు కారులో రూ.8లక్షలు, ఇంట్లో రూ.28లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో నాగరాజు అవినీతి వ్యవహారం వెనుక ఎవరెవరూ ఉన్నారనే విషయంపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. కారులో లభ్యమైన ఎంపీ లెటర్ హెడ్ ప్యాడ్‌తో పాటు ఆ ఎంపీకి.. నాగరాజుకు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. అమెరికాలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ పాత రౌడీ‌షీటర్ పేర్లపై కోట్ల రూపాయల బినామీ ఆస్తులు ఉన్నట్టు సమాచారం.

సోదాల అనంతరం నాగరాజు నివాసానికి ఓ బెంజ్ కారులో నలుగురు వ్యక్తులు వచ్చినట్టుగా తెలుస్తుండగా వీటన్నింటిపై ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలోనూ తహసీల్దార్ నాగరాజుకు అవినీతి మరకలు ఉండటం, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు కావడం లాంటి చరిత్ర ఉన్న నేపథ్యంలో ఇంకా ఏమైనా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా అనే కోణంలోనూ ఏసీబీ విచారణ చేపట్టనుంది. ముఖ్యంగా నాగరాజు ఆర్థిక వ్యవహారాలకు రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై ఏసీబీ మరింత దృష్టి పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed