వరల్డ్స్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్రిక్ మేకింగ్ వెహికల్

by Sujitha Rachapalli |
వరల్డ్స్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్రిక్ మేకింగ్ వెహికల్
X

దిశ, ఫీచర్స్ : పూర్వం వాడే మట్టి ఇటుకల నుంచి ప్రస్తుతం వాడుతున్న సిమెంట్ ఇటుకలు, లో వెయిట్ ఇటుకల వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఇటుకలు వాడుతుంటారు. ఈ సంగతి పక్కనబెడితే ఇటుకల తయారీకి కావాల్సిన మిశ్రమాన్ని కలపడానికి మెషిన్స్ వాడుతున్నా.. మన దేశంలో ఇటుక తయారీ అనేది శ్రమతో కూడుకున్న పనే. ఎందుకంటే తయారైన ఇటుకలను ఒక్కొక్కటిగా ఆరబెట్టడానికి మాన్యువల్ శ్రమ అవసరం. దీనికి చెక్ చెబుతూ.. హర్యానాకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి ఇటుకల తయారీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘ఎస్‌ఎన్‌పీసీ మెషిన్’ పూర్తి ఆటోమేటెడ్‌గా ఇటుకలను రూపొందిస్తోంది. అంతేకాదు ఈ ‘ఎస్‌ఎన్‌పీసీ మెషిన్’ భారత ప్రభుత్వ జాతీయ స్టార్టప్ అవార్డును కూడా అందుకుంది.

హర్యానాలోని సోనెపట్‌కు చెందిన సతీష్ కుమార్ పదో తరగతి డ్రాపవుట్ కాగా, తన కుటుంబానికి చెందిన ఇటుక బట్టీని నడిపేవాడు. ఆ సమయంలో లేబర్ సమస్య కారణంగా డిమాండ్‌కు తగ్గ ప్రొడక్ట్‌ను అందించలేకపోయేవాడు. ఈ క్రమంలో నష్టాలు రావడంతో వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? అని ఆలోచించాడు. చివరరకు ముడిసరుకును కలపడం, ఇటుకలు ఆరబెట్టడం తదితర పనులకు ఆటోమేషన్ పద్ధతి ఉంటే మేలని గ్రహించి, ‘ఎస్‌ఎన్‌పీసీ మెషిన్’ను రూపొందించాడు. ఇందుకోసం 2010-2014 వరకు కష్టపడి ఇంజనీర్లు, ఇటుక బట్టీదారుల ఆలోచనలతో ‘ఆటోమేటెడ్ యంత్రాన్ని అభివృద్ధి చేశాడు. అయితే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ, అవి స్టాటిక్ మెషిన్లు. ముడి ఇటుకలను ఎండబెట్టడం కోసం వాటిని బహిరంగ ప్రదేశాలకు తరలించడానికి మాన్యువల్ శ్రమ ఇంకా అవసరమైంది. అలా కాకుండా యంత్రం ట్రక్ లాగా కదిలి, ఇటుకలను ఒక్కొక్కటిగా వదిలితే బాగుంటుందనేది సతీష్ ఆలోచన. స్థానిక తయారీదారులు, వెల్డర్లతో తన ఆలోచన పంచుకుని, కదిలే ట్రక్ వంటి భాగాలను రూపొందించి ఎట్టకేలకు అనుకున్న ఔట్‌పుట్ తీసుకురాగలిగాడు. ఫైనల్ ప్రోటోటైప్ జనవరి 2015లో పూర్తి కాగా, ఈ ప్రోటోటైప్ ఒక గంటలో 9,000 ఇటుకలను క్రమపద్ధతిలో వదలగలదు.

ఈ క్రమంలోనే ఎంబీఏ చేసిన తన సోదరుడు విలాస్ చికారాతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ సంస్థ.. గంటలో 12,000 ఇటుకలను వదిలే రెండో వెర్షన్ మెషిన్‌ను కూడా రూపొందించింది. సంప్రదాయక ఇటుకల తయారీకి ఒక్కో బ్లాక్‌కు 60 పైసలు ఖర్చు కాగా, అదే ఎస్‌ఎన్‌పీఎస్ ఇటుకలు ఒక్కో బ్లాక్‌కు 20 పైసలు మాత్రమే ఖర్చు అవుతాయి. ‘నిర్మాణ అభివృద్ధి పర్యవేక్షణ సేవలు’ విభాగంలో ఎస్‌ఎన్‌పిసి యంత్రం భారత ప్రభుత్వం నుంచి అక్టోబర్ 2020లో జాతీయ స్టార్టప్ అవార్డును అందుకుంది.

ఎలా పనిచేస్తుందంటే?
ఈ ట్రక్ మెషిన్‌లో ఇటుకలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన జనరేటర్, మిక్సర్, అచ్చు ఉంటాయి. ముడి పదార్థాలను ట్రక్‌లోకి చేర్చిన తర్వాత, అవి అచ్చులోకి చేరుకుంటాయి. అందులోనే కాల్చిన తర్వాత భూమి నుండి ఒక అడుగు ఎత్తు నుంచి అచ్చు ఇటుకలను చాలా జాగ్రత్తగా కిందకు జారవిడుస్తుంది. అలా అంగుళం దూరంలో ఒక్కో ఇటుకను జారవిడుస్తూ ముందుకు కదులుతుంది. కాగా ఇప్పటి వరకు సతీష్.. ఆసియా మొత్తం మీద 250 యంత్రాలను పంపిణీ చేశాడు.

Advertisement

Next Story