ఇండియాకు యాంటీబాడీ టెస్టింగ్ కిట్స్ ఎగుమతి చేస్తాం: అబాట్

by vinod kumar |
ఇండియాకు యాంటీబాడీ టెస్టింగ్ కిట్స్ ఎగుమతి చేస్తాం: అబాట్
X

వాషింగ్టన్: అమెరికాలోని షికాగో కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఔషధ, వైద్య పరికరాల సంస్థ ‘అబాట్’ అతి తక్కువ సమయంలోనే కోవిడ్ 19 వ్యాధిని నిర్థారించే పరికరాన్ని రూపొందించింది. రక్తంలోని యాంటీబాడీస్ ద్వారా వ్యాధిని నిర్థారించే ఈ కోవిడ్-19 యాంటీబాడీ టెస్టింగ్ కిట్లకు సీఈ ధృవీకరణ లభించిందని తెలిపింది. కోవిడ్-19 వ్యాధి నిర్థారణలో ఈ టెస్టింగ్ కిట్లు మరింత వేగంగా ఫలితాలు అందిస్తాయని అబాట్ పేర్కొంది. ప్రస్తుతం యూనిట్ల తయారీలో వేగం పెంచామని.. త్వరలోనే ఇండియాకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్థారణ కిట్ల కొరత ఉంది. వేగంగా వ్యాధి నిర్థారణ అయితేనే చికిత్స త్వరగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి తాము కూడా కరోనాపై పోరాటంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకొని రావాలని భావిస్తున్నట్లు అబాట్ తెలిపింది. యాంటీబాడీ టెస్టింగ్ కిట్ల ద్వారా ఎవరెవరు రెండో సారి కూడా కరోనా బారిన పడ్డారనే విషయం కూడా తెలిసిపోతుందని అబాట్ డయాగ్నస్టిక్స్ బిజినెస్ ఇండియా జనరల్ మేనేజర్ నరేంద్ర వార్డే తెలిపారు. మే చివరి నాటికి అమెరికా నుంచి కిట్లు ఎగుమతి అవుతాయని తెలుస్తోంది. యాంటీబాడీ లేదా సీరాలజీ బ్లడ్ టెస్టు ద్వారా చాలా వివరాలు వెల్లడవుతాయి. వ్యాధి బారిన పడి కోలుకున్న వారి రక్తాన్ని పరీక్షించడం ద్వారా శరీరంలోని యాంటీబాడీస్ ఎంత కాలం వైరస్‌తో పోరాడాయనే విషయం కూడా తెలుస్తుంది. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేశాయా.. చివరి వరకు పోరాడాయా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ పరీక్ష కోసం వేలి నుంచి కొంచెం రక్తం తీసుంటే సరిపోతుందని.. ఫలితం కూడా పావు గంటలో వచ్చేస్తుందని సంస్థ తెలియజేసింది. పాజిటివ్ ఫలితమైతే 5 నిమిషాల్లో, నెగెటివ్ ఫలితమైతే 15 నిమిషాల్లో వెలువడుతుంది. ఈ పోర్టబుల్ టెస్టింగ్ కిట్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్లొచ్చని అబాట్ తెలిపింది.

Tags : Antibodies, Abbott, Coronavirus, Covid-19, Testing Kits

Advertisement

Next Story