అక్కడ పోలీసులందరూ ఆయన మనుషులేనా?

by Sumithra |
అక్కడ పోలీసులందరూ ఆయన మనుషులేనా?
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఓ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు ఓ వ్యక్తిని పోలీసు అధికారి సుమారు 40 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కమిషనర్‌కు ఫోన్‌ చేసి విషయాన్ని తెలపగా, ఆయన ఆదేశాల మేరకు ఓ ఉన్నతాధికారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విచారించి అక్రమ నిర్బంధమే అని తేల్చారు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ పోలీసు అధికారి ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకొన్నారు. బంధువులు, తెలిసిన వారు విడిచిపెట్టాలని చెప్పినా, ప్రజాప్రతినిధి మాటను కాదని నేను వదిలిపెట్టే ప్రసక్తిలేదని ఆ అధికారి భీష్మించుకొని కూర్చున్నారు. ఈ క్రమంలో విషయం సీపీ దృష్టికి రావడంతో ఓ ఉన్నతాధికారి అర్ధరాత్రి వేళ సదరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని చూశారు. వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారు. ఏదైన కేసులో నిందితుడుగా ఉన్నారా..? ఉంటే కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని సిబ్బందిని అడిగినా సమాధానం రాలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్స్‌ను పరిశీలించిన అధికారి సదరు వ్యక్తిది అక్రమ నిర్బంధమే అని తేల్చి అక్కడి పుస్తకంలో రాసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఇన్‌స్పెక్టర్‌ వెంటనే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కాళ్లావేళ్లా పడ్డారు. అధికారులు మాత్రం చేసిన తప్పుకు శిక్ష ఉంటుందని తేల్చిచెప్పడంతో ఆయన వెంటనే ప్రజాప్రతినిధిని ఆశ్రయించారని తెలిసింది.

సాధారణంగా ప్రతి పీఎస్ పరిధిలో ఎస్‌బీ అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. స్టేషన్‌లో జరిగే విషయాలు, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. పోలీసు స్టేషన్‌లో 40 రోజులుగా వ్యక్తిని నిర్బంధించి ఉంచిన విషయం బయట వ్యక్తులు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి చెప్పేవరకూ తెలియకపోవడం గమనార్హం. దీన్నిబట్టి అక్కడి పోలీసులందరూ సదరు ప్రజాప్రతినిధి మనుషులేనా అని ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. సాధారణంగా రాత్రి సమయంలో రౌండ్‌ అధికారి, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి పెట్రోలింగ్‌ నిర్వహిస్తారు. వారు కూడా గుర్తించలేదంటే ఆ ప్రజాప్రతినిధి ఎంతగా వారిని ప్రభావితం చేసిందీ అర్థమవుతోందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. సదరు ఠాణా అధికారి భూవివాదాల్లో తలదూర్చిన అంశాలపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు పనులు చేస్తున్న సదరు స్టేషన్‌ అధికారి, సిబ్బందిపై సమగ్రంగా విచారణ జరిపి వేటు వేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story