Heavy Rains:ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

by Jakkula Mamatha |
Heavy Rains:ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఐదు జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలకు ఈ రోజు(సోమవారం) సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి కోస్తా, తమిళనాడు వైపు పయనించనుంది.

దీని ప్రభావంతో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న తూ.గో జిల్లాలోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ సెలవులు పొడిగించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Next Story