వేములవాడ టికెట్ నాదే.. చెన్నమనేనికి షాకిచ్చేలా రంగంలోకి కీలక నేత?

by GSrikanth |
వేములవాడ టికెట్ నాదే.. చెన్నమనేనికి షాకిచ్చేలా రంగంలోకి కీలక నేత?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు రోజురోజుకు ఆసక్తి‌కరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితుల అంచనాల ఆధారంగా టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో గులాబీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తనయుడు లక్ష్మీ నరసింహారావు వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు గట్టిప్రయత్నాలే చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

స్పీడ్ పెంచిన చల్మడ

2009, 2014 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మీనరసింహారావు.. 2018 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయన స్పీడ్ పెంచడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో వేములవాడ సెగ్మెంట్‌లో పోటీ చేయడానికి గత కొంత కాలంగా గ్రౌండ్​వర్క్ చేస్తున్న ఆయన తాజాగా మంగళవారం వేములవాడలో పార్టీ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గ బీఆర్ఎస్ కేడర్‌లో సంచలనంగా మారింది. నేతకు టికెట్ దాదాపు ఖాయమైందని లక్ష్మినరసింహ రావు వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కలిసిరాబోతున్న వివాదాలు?

వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వంపై కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటి అనేదానిపై ఇప్పటికే కేసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే అసంతృప్తి ప్రజలతో పాటు నియోజకవర్గ నాయకుల్లో ఉందట. మరోవైపు కరీంనగర్ సిట్టింగ్‌గా ఉన్న మంత్రి గంగుల సైతం గ్రానైట్ వ్యవహారం కేసుతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకచోట నుండి లక్ష్మి నరసింహరావు పోటీ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.


Next Story

Most Viewed