అతడితో కలయికను దూరం పెట్టు.. అవసరమైతే కండోమ్ వాడు

by Bhoopathi Nagaiah |
అతడితో కలయికను దూరం పెట్టు.. అవసరమైతే కండోమ్ వాడు
X

డాక్టరు గారూ నా వయస్సు 27 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. నా భర్తకు వేరే స్త్రీలతో లైంగిక సంబంధాలు ఉన్నాయి. అదేంటని నిలదీస్తే, అరిచి, గొడవ పడతాడు. నా గురించి, పిల్లల గురించి అస్సలు పట్టించుకోడు. కొడతాడు, ఇల్లు గడవడానికి పైసలు ఇవ్వడం మానేస్తాడు. బాగా బ్లాక్మెయిల్ చేస్తాడు. అతని వ్యాధులు నాకు అంటిస్తాడేమో అని భయంగా ఉంది. నేను డిగ్రీ వరకే చదివాను. నా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. ఆయన పరువు పోతుందని ఇప్పటి వరకూ ఆగాను. ఇక ఓపిక నశిస్తుంది రోజురోజుకీ. ఎలా గట్టెక్కాలి చెప్పండి. -సుధ, ఖమ్మం

రాయి స్త్రీలతో లైంగిక సంబంధాల వలన ప్రమాదకరమైన సిఫిలిస్, గనోరియా, హెర్సీస్ లాంటి సుఖ వ్యాధులు హెచ్.ఐ.వీ, తరువాత ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పరువు కోసం చూడకుండా వెంటనే నీ పుట్టింట్లో, అత్తారింట్లో చెప్పు. నీ మీద కొంచెం కూడా ప్రేమ, గౌరవం బాధ్యత లేనివాడు, నీ పరువు, మర్యాదల గురించి ఆలోచించని ఆ బాధ్యత లేని భర్త అనబడే మనిషి కోసం, బాధ్యత లేని తండ్రి కోసం నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించ వలసిన అవసరం లేదు. నీ పిల్లల జీవితాన్ని, నీ జీవితాన్ని అతని కోసం పణంగా పెట్టాల్సిన అవసరమే లేదు. ఇన్నేళ్లు అలా చేసినందుకు అతనేమన్నా మారాడా ? లేదే. ఫ్యామిలీ మీటింగ్ పెట్టి అన్నీ నిజాలు కుటుంబ సభ్యులతో చెప్పెయ్యి. అసలు అతనితో కలిసి ఉండాలని అనుకుంటున్నావా లేదా నిర్ణయించుకో. ఉండాలని అనుకుంటే ముందు నువ్వు std, vdrl, hiv పరీక్షలు చేయించుకో. అతనికీ చేయించు. నీకు నెగటివ్ వచ్చి, అతనికి పాసిటివ్ వస్తే అతన్ని దూరంగా ఉంచు, విడిపో. కాపురమే కాదు, నీ ప్రాణం, పిల్లల జీవితం ముఖ్యం కదా. నీతో పాటు అతనికీ నెగటివ్ వస్తే, అతనికి ఈ అక్రమ లైంగిక సంబంధాలు మానే దిశగా కౌన్సిలింగ్, రిలేషన్షిప్ థెరపీ ఇప్పించవచ్చు. అంతే కాదు ఇంటి, పిల్లల బాధ్యతకి సంబంధించి కూడా అతనికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అయినా అతను మారకపోతే, అతని మీద గృహహింస కేసు పెట్టచ్చు. అంత వరకూ అతనితో శారీరిక సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండు. కండోమ్ వాడకం మరిచిపోవద్దు. అసలు కలయికే వద్దు దూరం పెట్టు. అన్నింటికన్నా ముందు చిన్న జాబ్‌లో చేరిపో.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed