- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల పరిస్థితేంటి? గోయల్ రాజీనామాకు కారణం అదేనా? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి..?
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మరో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుందనే ఊహాగానాలు జోరందుకున్న వేళ ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. తన రాజీనామాకు గల కారణాన్ని మాత్రం గోయల్ వెల్లడించలేదు. అయితే, ఎన్నికల నిర్వహణ సమయంలో దేశవ్యాప్తంగా భద్రతాపరమైన అంశాలపై చర్చించేందుకు ఎలక్షన్ కమిషన్ శుక్రవారమే కేంద్ర హోంమంత్రిత్వశాఖ, రైల్వే అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే అరుణ్ గోయల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈయన రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా, ఇప్పుడు అరుణ్ గోయల్ రాజీనామాతో మరో ఖాళీ ఏర్పడింది. అంతకుముందు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్, కమిషనర్లుగా అనూప్ పాండే, అరుణ్ గోయల్ ఉండేవారు. అనూప్ పాండే పదవీకాలం ఫిబ్రవరి 15న పూర్తవ్వడంతో ఆయన వెళ్లిపోయారు. ఆ స్థానం భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేశారు. ఇక మిగిలించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే. ముగ్గురు సభ్యులు ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పుడు రాజీవ్ మాత్రమే మిగిలారు. దీంతో ఆయన ఒక్కరే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు ఎలా చూసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, ఈ అనూహ్య పరిణామంపై ప్రతిపక్షాలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రాజీనామా వెనుక కేంద్రం హస్తం ఉండి ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం ఒత్తిడితోనే ఆయన రిజైన్ చేసుంటారని ఆరోపిస్తున్నాయి. దీంతో తమకు అనుకూలమైనవారిని ఆ పదవిలోకి తీసుకురావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఎవరీ గోయల్?
ఈయన 1962 డిసెంబర్ 7న పంజాబ్‌లోని పాటియాలలో జన్మించారు. మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ పట్టా పొందిన అరుణ్ గోయల్.. 1985వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన 2022 నవంబర్ 18న తన పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతి రోజే గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. విచారణ సందర్భంగా ‘ఇంత తొందరగా నిర్ణయం ఎలా తీసుకున్నారం’టూ న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘‘షార్ట్‌లిస్ట్ చేసిన పేర్ల జాబితా నుండి న్యాయశాఖ మంత్రి నలుగురి పేర్లను తీసుకున్నారు. ఆ ఫైల్ నవంబర్ 18నే ప్రధాని మోడీకి చేరింది. మోడీ కూడా అదే రోజు పేరును సిఫార్సు చేశారు. మేము కేంద్రంతో ఘర్షణ పడాలనుకోవడం లేదు. కానీ, ఈ నిర్ణయం ఏదైనా తొందరపాటుతో జరిగిందా? ఇంత వేగంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అంటూ ప్రశ్నించింది. అప్పట్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు గోయల్ పదవీకాలం 2027వరకు ఉన్నప్పటికీ, మూడేళ్ల ముందే రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
‘ఎన్నికల బాండ్ల’ వ్యవహారమే కారణమా?
రాజీనామాకు గల కారణాన్ని గోయల్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్లకు సంబంధించిన విచారణ జరుగుతుండటంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు కేంద్రంలోని ఓ అధికారి వెల్లడించారు. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలన్నింటినీ ఈ నెల 6లోగా ఎస్బీఐ నుంచి తీసుకుని, 13లోగా బహిరంగపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈసీకి వివరాలు అందజేయడానికి తమకు ఇచ్చిన గడువును జూన్ 30 వరకు పొడిగించాలని సుప్రీంకోర్టుకు ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ పాత్ర, స్పందనను న్యాయస్థానం కోరే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు. ‘‘కాబట్టి, ఎన్నికల సంఘంలో ఇద్దరు అధికారులు ఉంటే గనుక వీలైనంత తొందరగా స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు, అలా ఆదేశించినప్పటికీ, సీఈసీలో ఒక్కరే ఉన్నారు. పైగా, లోక్‌సభ ఎన్నికల హడావిడి ఉంటుంది. అన్ని పనులూ ఒక్కరే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, స్పందన తెలియజేయడానికి గడువు కోరినా కోర్టు అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఈ పరిణామాన్ని ఊహించే, కేంద్రంలోని పెద్దల సూచనతో గోయల్ రాజీనామా చేసి ఉంటారు’’ అని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.
నెక్స్ట్ ఏంటి?
ఎన్నికల సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను భర్తీ చేస్తామని, కమిషనర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని కేంద్రంలోని ఉన్నతాధికారులు చెప్పినట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినందున, కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో గణనీయమైన మార్పు అమల్లోకి రానుంది. దీని ప్రకారం, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని పర్యవేక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లు సుప్రీంకోర్టులో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం దాని అమలుపై ఎలాంటి స్టే లేదు. కాబట్టి, మెజార్టీ సభ్యుల(ప్రధాని, కేంద్రమంత్రి) ప్రతిపాదన మేరకు త్వరలోనే ఇద్దరు కమిషనర్లను నియమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హడావిడి నియామకం సబబేనా?
గతంలో 1999, 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో చీఫ్ కమిషనర్, మరో కమిషనర్ మాత్రమే ఉండడంతో ఎన్నికలు జరిగాయి. మిగిలిన అన్ని జనరల్ ఎలక్షన్స్ సమయంలోనూ ముగ్గురు కమిషనర్లు ఉన్నారు. ఇప్పుడు మాత్రమే తొలిసారిగా ఇద్దరు కమిషనర్లు లేకుండా కేవలం చీఫ్ కమిషనర్‌తో ఈసీ నడుస్తున్నది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. పైగా, ఒక్క లోక్‌సభకు మాత్రమేకాకుండా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇంతటి పనిభారం ఉన్న సమయంలో ఇద్దరు కమిషనర్లు లేకుండా కేవలం చీఫ్ కమిషనర్ నేతృత్వంలోనే ఎన్నికలు జరుగుతాయా? లేక ఇద్దరిని హడావిడిగా నియమిస్తారా? నియమించినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఎన్నికల నియమనిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నిర్వహణ కసరత్తు వంటి వాటిపై కొత్తగా బాధ్యతలు తీసుకునే ఇద్దరు కమిషనర్లు.. ఇంత తక్కువ సమయంలోనే అవగాహనకు వచ్చి ఈ ప్రక్రియలో పాల్గొనడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘తీవ్ర ఆందోళనకరం’
అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఈసీలో మిగిలింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం, ప్రధాని, కేంద్రమంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన నియామక కమిటీలో మెజార్టీ ఓట్లతో ఎన్నికల కమిషనర్లను నియమించొచ్చు. దీని ప్రకారం, లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లకుగానూ ఇద్దరు కమిషనర్లకు మోడీ నియమిస్తారు. ఇది చాలా చాలా ఆందోళనకరం’’ అంటూ టీఎంసీ వెల్లడించింది.
‘ప్రజాస్వామ్య సంప్రదాయలు ధ్వంసం’
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల తరుణంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలా పనిచేస్తుంది.. వారితో ప్రభుత్వం ఎలా నడుచుకుంటుంది అనేవాటిపై పారదర్శకత లేకుండాపోయింది. 2019 ఎన్నికల సమయంలో, మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రధానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అప్పటి కమిషనర్ అశోక్ లావాసా వ్యతిరేకించారు. తర్వాత, అతను ఎడతెగని విచారణలు ఎదుర్కొన్నాడు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ధ్వంసం చేసేందుకే ఈ పాలన సాగుతోందడానికి ఇదే నిదర్శనం. తాజా పరిణామంపై వివరణ ఇవ్వాలి. ఎన్నికల సంఘం ఎప్పటికీ పక్షపాతరహితంగా ఉండాలి’’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు.