IPL 2025 : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

by Harish |
IPL 2025 : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : మరో 11 రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభంగానున్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటర్, ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. జాతీయ జట్టు బాధ్యతల కారణంగా భారత టీ20 లీగ్ ఆడలేనని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఇంగ్లాండ్ క్రికెట్‌కు ఇది చాలా ముఖ్యమైన సమయం. రాబోయే సిరీస్‌ కోసం సన్నద్ధమవడానికి కట్టుబడి ఉన్నాను. అందుకోసం నాకు సమయం కావాలి. అందరూ దీన్ని అర్థం చేసుకోరని నాకు తెలుసు. కానీ,నేను నమ్మినదాన్ని చేయాలి. నా దేశానికి ఆడటమే నా ప్రాధాన్యత.’అని బ్రూక్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

బ్రూక్ నిర్ణయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. మెగా వేలంలోని ఢిల్లీ అతన్ని రూ 6.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బ్రూక్ స్థానాన్ని ఫ్రాంచైజీ భర్తీ చేస్తుందో?లేదో? చూడాలి. మరోవైపు, బ్రూక్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఐపీఎల్ కొత్తగా తీసుకొచ్చిన రూల్ ప్రకారం.. వేలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లేదా ఆక్షన్‌‌లో ఎంపికైన తర్వాత ఏ ఆటగాడైనా సీజన్‌కు అందుబాటులో ఉండకపోతే అతనిపై రెండు సీజన్లపాటు టోర్నీలో పాల్గొనకుండా బ్యాన్ చేయొచ్చు. గాయం బారిన పడిన ప్లేయర్లకు మాత్రమే ఈ రూల్ నుంచి మినహాయింపు ఉంది. బ్రూక్ గతేడాది కూడా వేలం తర్వాత సీజన్ నుంచి తప్పుకున్నాడు.


Next Story

Most Viewed