కోహ్లీతో యుద్ధానికి ఆజ్యం పోసిన గంభీర్.. ఆర్సీబీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు

by Harish |
కోహ్లీతో యుద్ధానికి ఆజ్యం పోసిన గంభీర్.. ఆర్సీబీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌కు ముందు గంభీర్ మాట్లాడిన ఓ వీడియోను స్టార్ స్పోర్ట్స్ పోస్టు చేసింది. ఈ వీడియోలో గంభీర్ మాట్లాడుతూ.. తాను కలలో కూడా ఓడించాలనుకునే జట్టు ఆర్సీబీనేనని వ్యాఖ్యానించాడు.

అంతటితో ఆగని అతను ఆర్సీబీపై నోరు పారేసుకున్నాడు. బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఏం సాధించకపోయినా అన్ని సాధించామనే పొగరుతో ఉంటారన్నాడు. ‘బెంగళూరు లీగ్‌లోనే రెండో హై ప్రొఫైల్ టీమ్. యజమానితోపాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి స్టార్లను కలిగిన ఆడంబరమైన జట్టు.నిజం చెప్పాలంటే ఆ జట్టు ఏం సాధించలేదు. కానీ, ఇప్పటికీ అన్నీ సాధించినట్టు భావిస్తారు. అలాంటి వైఖరిని నేను సహించను. బెంగళూరుపై కేకేఆర్ మూడు అత్యుత్తమ విజయాలు సాధించింది. నా కెరీర్‌లో నేను కోరుకునేది ఒక్కటే. మైదానంలో ఆర్సీబీని ఓడించడం.’ అని గంభీర్ చెప్పాడు.

కాగా, గత సీజన్‌లో గంభీర్ లక్నోకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో బెంగళూరు, లక్నో మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా గంభీర్ ఆర్సీబీపై నోరు పారేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మళ్లీ యుద్ధానికి గంభీర్ ఆజ్యం పోశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story