వాళ్లకు అవన్నీ తెలియవు.. అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికా : దినేశ్ కార్తీక్

by Harish |
వాళ్లకు అవన్నీ తెలియవు.. అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికా : దినేశ్ కార్తీక్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇటీవల ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-17లో రాజస్థాన్‌, బెంగళూరు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచే అతనికి చివరిది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దినేశ్ కార్తీక్ తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలను వెల్లడించాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడానికి మానసిక ఆందోళననే కారణమని చెప్పాడు.

‘శారీరకంగా క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నా. మరో మూడేళ్లు అడగలను. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌‌తో అది ఇంకా సులభతరం అవుతుంది. నా జీవితంలో పెద్దగా సమస్యలు లేవు. మూడు దశాబ్దాల కెరీర్‌లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా దూరం కాలేదు. నా శరీరం, ఫిట్‌నెస్‌పై ఆందోళన లేదు. కానీ, ఇది మానసిక కోణానికి సంబంధించింది. మానసికంగా ఆడాలని అనుకున్నా సరిగ్గా ఆడలేం. బయట వాళ్లకు ఇవేవి తెలియకపోవచ్చు. కానీ, నాకు తెలుసు. అందుకే, నేను తప్పు చేస్తున్నాననే భావనతో ఉండను. అలాంటి పని చేయను.’ అని వివరించాడు.

అలాగే, భారత్ తరపున ఆడే అవకాశాలు కూడా కష్టమవడం కూడా ఓ కారణమని చెప్పాడు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. కాగా, ఈ సీజన్‌లో బెంగళూరు తరపున దినేశ్ కార్తీక్ 13 ఇన్నింగ్స్‌ల్లో 326 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో బెంగళూరుతోపాటు ఢిల్లీ, పంజాబ్, ముంబై, కోల్‌కతా జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను.. 257 మ్యాచ్‌ల్లో 4,842 పరుగులు చేశాడు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story