Cyber Alert: సైబర్ కేటుగాళ్ల కొత్త రూట్! జిల్లా కలెక్టర్ల ఫోటోలతో ఫేక్ మేసేజ్‌లు!

by Ramesh N |
Cyber Alert: సైబర్ కేటుగాళ్ల కొత్త రూట్! జిల్లా కలెక్టర్ల ఫోటోలతో ఫేక్ మేసేజ్‌లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్‌ నేరగాళ్లు ఈ మధ్య బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్‌లను సైతం టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్‌ ఫొటోతో నకిలీ వాట్సాప్‌ ఖాతాను సృష్టించిన సైబర్‌ కేటుగాళ్లు పలువురిని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరిట వాట్సాప్‌లో మోసపూరిత మేసేజ్‌లు జిల్లాలో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన పేరిట వచ్చే తప్పుడు కథనాలను, +94755455869 గల ఫోన్ నెంబర్ నుంచి వచ్చే మోసపూరిత వాట్సాప్ మెసేజ్‌లను జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ తాజాగా ఒక ప్రకటనలో తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ పేరిట మోసపూరిత మేసేజ్‌లు, పలు తప్పుడు కథనాలు, వాట్సాప్, ఫేస్ బుక్, వివిధ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్‌లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్‌ నుంచి ఆ సందేశం పంపిన సైబర్‌ నేరగాడు డబ్బులు ఫోన్‌పే చేసి, స్క్రీన్ షాట్​​ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన క‌లెక్ట‌ర్ ప్రావీణ్య త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా రాజన్న సిరిసిల్లకు చెందిన కలెక్టర్ పేరిట వచ్చిన నెంబర్ కూడా శ్రీలంక నుంచి ఉండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే సైబర్ కేటుగాళ్లు జిల్లా కలెక్టర్ల ఫోటోలతో ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story