నకిలీ విత్తనాల వ్యాపారులపై 311 క్రిమినల్ కేసులు

by Shyam |   ( Updated:2021-06-21 07:44:10.0  )
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : నకిలీ విత్తనాలపై జరిపిన దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 311 క్రిమినల్ కేసులు నమోదు చేసి 446 మందిని అరెస్ట్ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. నిత్యవసరాల సరుకుల చట్టంలోని సెక్షన్ 6(ఎ) కింద 3 కేసులు, ఏడుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించామని వెల్లడించారు.

గుంటూరు, కర్నూలు, రాయచూరు, మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే నకిలీ విత్తనాల మూలాలున్నాయని చెప్పారు. మార్కెట్‌లో ఎక్కవగా మిరప, పత్తి నకిలీ విత్తనాలే పట్టుబడుతున్నాయని చెప్పారు. చట్టవ్యతిరేకంగా దందా కొనసాగిస్తున్న డీలర్ల లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేశామన్నారు. ఖమ్మంలో అనుమతిలేని మిరప విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు డీలర్లు, ఆదిలాబాద్ లో ధరల లేబుళ్లను మార్చి అమ్ముతున్న ఇద్దరి డీలర్ల లెసెన్సులు రద్దు చేశామని చెప్పారు.

రాష్ట్రంలో వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.70.9 కోట్ల విలువైన 20,561 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలు నిలిపివేసామన్నారు. వాటి నాణ్యత పరిశీలనకు విత్తన నమూనాలను పరీక్షాకేంద్రాలకు తరలించామన్నారు. పత్తి, మిరప కాకుండా రూ.9.83 కోట్ల విలువైన 5,724 క్వింటాళ్ల ఇతర విత్తనాల అమ్మకాలు నిలిపివేసామని తెలిపారు. విత్తన, పురుగుమందులు, ఎరువుల చట్టాలలో ఉన్న లొసుగులను గుర్తించి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు, నకిలీ ఎరువులను అరికట్టేందుకు 2017 నుండి వీటిని పీడీ చట్టం పరిధి కిందకు ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

2017 నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులపై 32 పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాని ప్రకటించారు. దేశంలో నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. హెచ్‌టీ కాటన్ నిరోధించేందుకు 59 ప్రాంతాలలో విత్తన నమూనాలు స్వీకరించి నలుగురిపై చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా ముందస్తు ప్రణాళికతో వచ్చే సీజన్‌లో ఫిబ్రవరి నుండే విత్తన ఉత్పత్తి సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన ఉత్పత్తిదారులపై నిఘా ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.

రైతుబంధు ద్వారా రూ.6012.72 కోట్లు పంపిణీ

రైతుబంధు పథకం ద్వారా 57.61 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6012.72 కోట్లు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఒక్క రోజే 3.24 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.866.84 కోట్లు జమ చేశామన్నారు. మొత్తం ఇప్పటి వరకు 120.25 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం పంపిణీ చేపట్టామన్నారు.

Advertisement

Next Story