ఏపీలో కరోనా విలయతాండవం

by srinivas |
coronavirus
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కుదిపేస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన నాటి నుంచి ఏరోజుకారోజు రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో ఏపీలో 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన కేసులు 2,584 అయితే, ఇతర రాష్ట్రాలకు చెందినవి కేవలం 9 కావడం విశేషం. మరోవైపు అదే సమయంలో 943 కరోనాకు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారిన 38,044 మంది పడ్డారు.

కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో 590 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాలో కూడా అదే స్థాయిలో 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక జిల్లాలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లాలో 200కి పైగా కేసులు నమోదైతే… వైజాగ్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలోని వివిధ ఆస్పత్రుల్లో 18,159 మంది చికిత్స తీసుకుంటుండగా, 19,393 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇంకోవైపు తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిదేసి మంది చొప్పున మృతి చెందగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించారు. కడపలో నలుగురు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ జిల్లాల్లో నలుగురేసి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు.

Advertisement

Next Story