ఆనందయ్య మందు ఎఫెక్ట్.. నెల్లూరులో 144 సెక్షన్.. ఆధార్ ఉంటేనే అనుమతి!

by Anukaran |
ఆనందయ్య మందు ఎఫెక్ట్.. నెల్లూరులో 144 సెక్షన్.. ఆధార్ ఉంటేనే అనుమతి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామంలోనికి అడుగుపెట్టాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ప్రస్తుతం అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య పంపిణీ చేసే మందు కోసం జనాలు భారీ ఎత్తున కృష్ణ పట్నానికి తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. మందు పంపిణీకి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.

అప్పటివరకు కృష్ణపట్నానికి ఎవరూ రావొద్దని ఏపీ పోలీసులు హెచ్చరించారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసి జనాలు భారీగా తరలివస్తే మళ్లీ కరోనా పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే అక్కడ 144 సెక్షన్ విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, ఆనందయ్య మందుకు ఆయుర్వేద గుర్తింపు లభించనందున ఆ మందు పంపిణీని విరమించుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ప్రకటించారు. అయితే, ఆసక్తి గల వారు మందు తీసుకోవచ్చునని స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story