బ్రేకింగ్.. హుజురాబాద్ ఎన్నికల వేళ కేసీఆర్‌కు భారీ షాక్

by Anukaran |   ( Updated:2021-07-30 02:18:13.0  )
KCr
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిచ్చేందుకు ఎంపీటీసీలు స‌న్నద్ధమ‌వుతున్నారు. వంద‌లాది మంది ఎంపీటీసీలు ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు దాఖ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. ఈ నిర‌స‌న‌ పోరుకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం నుంచి అంకురార్పణ జ‌రుగుతోంది. ప్రజ‌ల చేత ఎన్నుకోబ‌డిన త‌మ‌ను ప్రభుత్వం నిధులు కేటాయించ‌కుండా చేత‌గాని ప్రజాప్రతినిధులుగా త‌యారు చేసింద‌ని తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

విలువ‌ల్లేని ప‌దవుల్లో ఉండి ఏం లాభం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంపీటీసీ ఎమ్మెల్సీగా కేసీఆర్ త‌న‌య క‌విత ఎన్నికైన త‌ర్వాత‌నైనా ఎంపీటీసీలకు నిధులు ద‌క్కుతాయని ఆశ‌ప‌డినా అదీ జ‌ర‌గ‌లేద‌ని నిరాశ‌ను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు బ‌ల‌ప‌డాల్సిందిపోయి.. బ‌ల‌హీనం కావ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని వాపోతున్నారు. పంచాయ‌తీల్లో స‌ర్పంచుల‌తో స‌మానంగా త‌మ‌కు గౌర‌వం క‌ల్పించ‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయ‌తీల్లో ఎంపీటీసీల‌కు క‌నీసం కుర్చీ కూడా గ‌తి లేకుండా చేసిన ఘ‌న‌త ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ద‌క్కింద‌ని తూర్పార‌ప‌డుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించ‌కుండా పంచాయ‌తీల్లో త‌మ‌కు స‌రైన గౌర‌వం లేకుండా చేస్తోంద‌ని ఎంపీటీసీలు మండిప‌డుతున్నారు. సర్కార్ త‌మ‌ను ఉత్సవ విగ్రహాలుగా మార్చింద‌ని, ప్రజాప్రతినిధులమైన త‌మ‌ను అప‌హాస్యం చేస్తోందంటూ రగిలిపోతున్నారు. త‌మ‌ను అవ‌మానాల పాలు చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి త‌గిన బుద్ధి చెప్పాల‌నే ఉద్దేశంతో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

వంద‌లాది మంది నామినేష‌న్లు..

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో క‌నీసం వంద‌మందికి త‌క్కువ కాకుండా ఎంపీటీసీలు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నట్లు స‌మాచారం. ఉప ఎన్నిక‌లో పోటీ చేసి ప్రభుత్వం త‌మ‌పై ప్రద‌ర్శిస్తున్న వివ‌క్షను ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లాల‌నే వ్యూహాత్మక రాజ‌కీయ ఎత్తగ‌డ‌తో ముందుకెళ్లబోతున్నారు. పోటీదారుల్లో అన్ని జిల్లాల‌కు చెందిన ఎంపీటీసీలు ఉండ‌బోతున్నట్లు ఫోరం నాయ‌కుల ద్వారా తెలుస్తోంది. ప‌ది, ప‌దిహ‌ను రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డం, అనుస‌రించాల్సిన వ్యూహం, ఎంత‌మంది పోటీ చేసే విష‌యంపై రాష్ట్ర ఫోరం కార్యాచ‌ర‌ణ ప్రక‌టించ‌నుంది.

ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లతో నిర‌స‌న‌..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వేం. వాసుదేవ‌రెడ్డి.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం నిర్ణయం తీసుకుంది. దాదాపు 800 మంది ఎంపీటీసీలు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వ‌ర‌కు చిల్లిగ‌వ్వ కూడా ఎంపీటీసీల‌కు నిధుల కేటాయింపు చేయ‌లేదు. బ‌డ్జెట్‌లో చూపిన రూ.500కోట్లను విడుద‌ల చేయ‌లేదు. ప్రజల‌చేత ఎన్నికై వారికి ఏం చేయ‌లేక‌పోతున్నామని ఎంపీటీసీలు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంపీటీసీల‌ను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. త‌మకు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు వంద‌లాది మంది ఎంపీటీసీలు హుజురాబాద్ ఉప ఎన్నికలో నామినేష‌న్లు వేసేందుకు నిర్ణయించాం.

vasudevareddy

ఫ్లాష్.. ఫ్లాష్.. కేటీఆర్‌ను ఆశ్రయించిన యాంకర్ రష్మి

మీరే పరిష్కారం చూపాలంటూ రిక్వెస్ట్.. అసలేం జరిగింది??

Advertisement

Next Story