1.5 కోట్లతో ఉడాయించిన పూజారి.. ఆపై బాధితులకు ఉత్తరాలు..

by Shyam |   ( Updated:2021-08-02 03:15:43.0  )
priest
X

దిశ, నిజామాబాద్ రూరల్: డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో పూజారి పేరుతో అమాయక మహిళలను నమ్మించి రూ 1.5 కోట్లతో ఉడాయించిన పూజారి శ్రీనివాసశర్మను పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు సీఐ రఘునాథ్, ఎస్సై ఆంజనేయులు స్పెషల్ టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పూజారి డబ్బులు తీసుకెళ్లిన ఐదుగురు మహిళలకు ఉత్తరం రాయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తన సెల్ ఫోన్ పోయిందని, కుడిచేయి విరిగిపోయిందని, తాను ప్రస్తుతం జనగామ జిల్లాలో ఓ ఆలయ పూజారిగా పనిచేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు.

నేను ఎవరినీ మోసం చేయలేదని, నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కేవలం వెయ్యి రూపాయలతో జనగామ జిల్లాకు వచ్చినట్లు, తనకు ఎవరిని మోసం చేసే ఉద్దేశం లేదని, తాను పూజారిగా గ్రామంలో, ఆలయంలో ఎన్నో సేవాలు కార్యక్రమాలు చేపట్టినట్టు ఉత్తరంలో రాశాడని ఎస్సై వెల్లడించారు. ఆ లేఖతో సదరు మహిళలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి, శ్రీనివాస్ శర్మ ను పట్టుకొని తమ డబ్బులను తిరిగి ఇచ్చే విధంగా చూడాలని పోలీస్ సిబ్బందిని వేడుకున్నారు. ఇదిలా వుండగా పూజారి ఉత్తరంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు బాధితులు పేర్కొంటున్నారు. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story