- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో బది‘లీలలు’.. మమతకు అండగా ఓ మంత్రి, ఎమ్మెల్యేలు

దిశ, తెలంగాణ బ్యూరో/ ఎల్‌బీనగర్ : “ఉదయం 11 గంటలు.. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఐదుగురు జోనల్ కమిషనర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ. హాట్ కేక్ వంటి కూకట్‌పల్లి నుంచి జోనల్ కమిషనర్ వి.మమతను ఎల్‌బీనగర్ జోన్‌కు బదిలీ చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.’’
“మధ్యాహ్నం 4 గంటలకు మళ్లీ సవరణ జీవో జారీ. ఎల్‌బీనగర్ జోన్‌కు బదిలీ అయిన మమతను మళ్లీ కూకట్‌పల్లికి మారుస్తూ.. ఇక్కడకు బదిలీ చేసిన పంకజంను ఎల్‌బీనగర్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆర్డర్స్.’’
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ గెజిటెడ్అధికారుల సంఘం అధ్యక్షురాలు వి. మమత కోసం జీవోలే మారుతున్నాయి. గంటల వ్యవధిలోనే చేంజ్అవుతున్నాయి. ఇలా ఇప్పుడే కాదు.. గతంలోనూ అంతే. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో చందానగర్ డీసీగా పనిచేసినప్పుడు కూడా మమతను యూసుఫ్‌గూడ్ డీసీగా ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ, కేవలం గంటల వ్యవధిలోనే ఆ జీవోలు మారాయి. మళ్లీ యథాస్థానానికి బదిలీ చేశారు. ఇలా ఎక్కడంటే అక్కడే మమతను కొనసాగించేందుకు ఇప్పుడు ఓ మంత్రి తెర వెనక నుంచి చక్రం తిప్పుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఓ మంత్రి.. ముగ్గురు ఎమ్మెల్యేలు..
గ్రేటర్ పరిధిలో కూకట్‌పల్లి జోన్ అంటే హాట్‌కేక్. ఇక్కడ పనిచేసేందుకు లక్షలు ఖర్చు పెట్టుకొని బదిలీ చేయించుకుంటారు. అంతేకాదు.. గ్రేటర్ చరిత్రలో కూడా కూకట్‌పల్లి జోన్‌లో అవినీతి కూడా ఎక్కువే. ఇటీవల కూకట్‌పల్లి సర్కిల్‌పరిధిలో ఏసీబీ దాడులు కూడా జరిగాయి. కానీ అక్కడ ఉన్నతాధికారులకు మాత్రం ఈ అవినీతి మరకలు అంటకుండా అప్పుడు కూడా ఓ మంత్రి రాయబారం చేసినట్లు ప్రచారం జరిగింది. గతంలోనూ ఏసీబీ అధికారులకు ఈ జోన్‌లపై ఫిర్యాదులు వెళ్తే ఏసీబీ అధికారులు, సదరు ఉన్నతాధికారి మధ్య మంత్రి ఒప్పందాలు కూడా చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లోనే చర్చ నడిచింది. వాస్తవానికి మూసాపేట సర్కిల్ డీసీగా, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా మమత ఇక్కడ లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నారు. పలుమార్లు కొంతమంది రాజకీయ నేతలతో విభేదాలు వచ్చినా.. వాటిని సర్దిచెప్పేందుకు కూడా అమాత్యులు, ఎమ్మెల్యేలు రెడీ ఉంటారనే టాక్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం బుధవారం ఉదయం ఐదుగురు జోనల్ కమిషనర్లను బదిలీ చేయగా.. మమతను ఎల్‌బీనగర్‌కు మార్చారు. కానీ ఎల్బీనగర్జోన్లో చేయడం ఎందుకు ఇష్టం లేదో కానీ.. అక్కడకు వెళ్లేందుకు వెనకడుగు వేశారు. దీంతో మమతకు మద్దతుగా తెర వెనక ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ కీలక మంత్రి ఓఎస్డీ హుటాహుటినా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని, ఈ సమయంలో జోనల్ కమిషనర్‌ను బదిలీ చేస్తే మొత్తం అభివృద్ధి ఆగిపోతుందంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ శాఖ మంత్రికి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గంటల వ్యవధిలోనే జీవోలు మార్చారు. కూకట్‌పల్లి జోన్‌కు బదిలీ అయిన పంకజంకు ఆ సంతోషం కనీసం ఒక్క రోజు కూడా ఉండలేదు.
బల్దియాలో పొలిటికల్ గ్రేట్..
జీహెచ్‌ఎంసీలో రాజకీయ అండదండలుంటే చాలు ఎంతటి పోస్టింగ్ అయినా కాళ్ల దగ్గరకు వచ్చి చేరుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపల్ శాఖ అంటే అవినీతికి నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. పోస్టింగ్‌ల కేటాయింపు, బదిలీల విషయంలో బంధుప్రీతి, అవినీతి, ప్రభుత్వాధినేతల అండదండల లాబీయింగ్‌తో కొంతమంది పైచేయి సాధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న టీజీవో అధ్యక్షురాలు మమతకు ఆమె కంటే ముందు వరుసలో 22 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నా జోనల్ కమిషనర్‌గా ప్రమోషన్ కల్పించిన విషయం పెద్ద చర్చకే దారి తీసింది.
ఈ పదోన్నతిలో ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో లాబీయింగ్ భారీ స్థాయిలో జరిగిందని, సర్కారు అండదండలతో 22 మంది అధికారులు ముందు వరుసలో ఉన్నా జోనల్ కమిషనర్‌గా ప్రమోషన్‌తో పాటు అత్యంత కీలకమైన కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా పోస్టింగ్ రావడం మామూలు విషయం కాదంటూ తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది.
అయితే గతంలో జోనల్ కమిషనర్ శంకరయ్య అంశం కూడా హాట్‌టాపిక్‌గానే మారింది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన శంకరయ్యకు జీహెచ్‌ఎంసీలో పోస్టింగ్ ఇవ్వకుండా ఎంఏయూడీకి అటాచ్ చేశారు. శంకరయ్య మాత్రం ఎంఏయూడీలో కనీసం రిపోర్టు చేయకుండా.. ఒకే రోజులో తిరిగి బల్దియాలోనే పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఆయనను బల్దియాలో అడిషనల్ కమిషనర్‌గా నియమించడం, దీనికోసం ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలంగాణ గవర్నర్ఆదేశాల మేరకు అని ఇవ్వడంతో పైరవీలు ఎంత మేరకు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోందని అంటున్నారు.
ప్రాధాన్యంలేని పోస్టుల్లో చాలా మంది..
ప్రస్తుతం జరిగిన బదిలీల్లో పోస్టులు ఉన్న వారికే మళ్లీ అవకాశం కల్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎల్బీనగర్జోనల్కమిషనర్ ఉపేందర్‌రెడ్డిని పలు కారణాల నేపథ్యంలోనే నల్గొండకు బదిలీ చేశారంటున్నారు. ఇటీవల భవనాలకు ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి ఆయన వ్యక్తిగతంగా తనిఖీలకు వెళ్లడం కూడా ఆయన ట్రాన్స్‌ఫర్‌కు కారణమైంది. అయితే జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే ఏండ్ల నుంచి చాలా మంది అధికారులు ఎలాంటి విధులు లేకుండా ఖాళీగా ఉన్నారు. కానీ, వారిలో ఒక్కరికి కూడా పోస్టింగ్ రావడం లేదు. ప్రస్తుతం పంకజంకు మాత్రమే పోస్టింగ్‌వచ్చింది. ప్రధాన కార్యాలయంలో చాలా మంది పనిలేని విధుల్లో ఉన్నా.. వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.