ఉచిత విద్య హామీ ఏమైంది.. కేసీఆర్‌కు షర్మిల సూటి ప్రశ్న

by Shyam |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని సీఎం కేసీఆర్ చేసిన హామీ ఏమైందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచడంపై ఆమె మండిపడ్డారు. కొవిడ్ కష్ట కాలంలో ప్రభుత్వం ఫీజులు తగ్గించాల్సింది పోయి భారీగా పెంచడం దారుణమని పేర్కొన్నారు. ఒక్కో కోర్సుపై రూ.10 వేల నుంచి రూ.40 వేల భారం మోపడం సమంజసం కాదని, ఇవి ఇంకా క‌నిష్టమేనంటూ విద్యాశాఖ పేర్కొన‌డం దుర్మార్గంమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల‌కు రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించ‌ని ప్రభుత్వం, ఫీజులు మాత్రం పెంచుకుంటూ పోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది విద్యార్థుల‌కు రూ.3,816 కోట్ల రీయింబ‌ర్స్ మెంట్ అంద‌క ఇబ్బంది ప‌డుతున్నారన్నారు. ప్రభుత్వం వెంట‌నే పెండింగ్ బకాయిలు విడుద‌ల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కమీషన్ల కోసమే ప్రైవేట్ కంపెనీలకు డబ్బులు

సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే మేఘా సంస్థ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం ఇస్తే, యువతకు కార్పొరేషన్ లోన్లు, డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే, ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్ కు కమీషన్లు రావని, కానీ ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కమీషన్లు వస్తాయన్నారు. అందుకే మేఘా కంపెనీ కట్టే ప్రాజెక్టులకు కేసీఆర్ డబ్బులిస్తున్నారని ఆమె విమర్శలు చేశారు.

Advertisement

Next Story