తెలంగాణ కాంగ్రెస్‌లో ఆపరేషన్ 'సూర్య'

by Shyam |
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆపరేషన్ సూర్య
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వావిర్యాలలో ఏర్పాటు చేసిన పాదయాత్ర ముగింపు సభలో వైఎస్ నీడ ‘సూరీడు’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాదాపూ పుష్కర కాలం తరువాత సూరీడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో దర్శనమివ్వడం.. “వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైఎస్ఆర్ నీడ సూరీడు కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న వైఎస్‌ఆర్ అభిమానులు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్న” సంకేతాలిచ్చేందుకే రేవంత్ రెడ్డి సూరీడిని రంగంలోకి దించారా? రేవంత్ రెడ్డి అన్నట్లు రైతులకు మద్దతు పలికేందుకే ఏపీ నుంచి సూరీడు వస్తే.. అదే పార్టీకి చెందిన ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు రాలేదు?

నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాజకీయ ఉప్పెనలా విరుచుకుపడ్డ షర్మిల మరోసారి వార్తల్లో నిలిచారు. 16 నెలల పాటు జైల్లో ఉన్న అన్నకి అండగా వైసీపీ జెండాను పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. ప్రాంతీయ పార్టీగా వైసీపీ తన అస్థిత్వాన్ని కాపాడుకుంటూ సానుభూతి ప్రకంపనలు సృష్టించడానికి షర్మిల ఓ ఇంధనమై ఉపయోగపడ్డారు. ఇప్పుడు అదే షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని అంటున్నారు. ఆ ఏర్పాట్లలో బిజీ అయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్ కూతురిగా తెలంగాణలోకి వస్తే చీరా సారె పెట్టి పంపుతాం తప్పా అధికారం చేపట్టడానికి వస్తే మాత్రం అంగీకరించేది లేదంటూ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అలా అని స్టేట్మెంట్ తో సరిపెట్టుకోలేదు. షర్మిల పార్టీ పెట్టనూ లేదు. అస్సలు ఆమె వెంట ఎవరుంటారనేది ఇంకా తేలనేలేదు. ఆమె వచ్చేసి. తమ పార్టీ ఓట్లు చీల్చేసీ.. తనకు దక్కాల్సి తెలంగాణ స్టేట్ సీఎం పదవిని ఆమేదో ఎగిరేసుకుపోతుందని అనుకున్నారో ఏమో సూరీడును రంగంలోకి దించి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. కాదు.. కాదు అనేక అనుమానాలకు తావిచ్చారు.

వైఎస్ఆర్ సన్నిహితులనగానే మనకు ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తొకొచ్చేవి. ఒకటి వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ.. రెండు వైఎస్ఆర్ నీడ సూరీడు. సూరీడు.., రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా దాదాపూ 3 దశాబ్ధాలకు పైగా పనిచేశాడు. పైగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం తెర చాటుకు వెళ్లిపోయారు. కారణాలేంటో తెలీదు కానీ ఆయన వైఎస్ కుటుంబానికి, సన్నిహితులకు దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపూ 10ఏళ్ల తరువాత ఇప్పుడు సూరీడు రేవంత్ రెడ్డి సభలో ప్రత్యక్షమయ్యారు.

వైఎస్ఆర్ తొలి నుంచి మరణం వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకొని ఏపీలో తన పరిపాలనను కొనసాగిస్తున్నారు. వైఎస్ మరణం తరువాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎక్కడా కనిపించని సూరీడు.. వైఎస్ కుమార్తె షర్మిల.. వైఎస్ ఇమేజ్ తో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు కార్యచరణకు సిద్ధమవుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు హాజరవ్వడం సంచలనంగా మారింది. మొత్తానికి వైఎస్ నీడ తెలంగాణ కాంగ్రెస్ తురుపు ముక్క అయ్యారా? లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed