- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగన్ ఆదేశిస్తే.. మంత్రులు పూర్తి చేశారు
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఓ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీక్ అనంతరం తీసుకుంటున్న చర్యలపై ఆయన మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ,
అవంతి శ్రీనివాస్‌ల, జిల్లా అధికారులతో మాట్లాడారు.
సహాయక చర్యలతో పాటు బాధితులకు అందాల్సిన పరిహారంపై మంత్రులు, ఏపీ అధికారులకు జగన్ కీలక సూచనలు చేశారు. మృతులకు చెందిన ఐదు కుటుంబాలకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని మంత్రులు జగన్‌కి చెప్పారు. కొందరు నగరానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పరిహారం అందుకోలేకపోయారని, వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు.
గ్యాస్ లీక్ జరిగిన గ్రామాల్లో, ఇళ్లలో శానిటేషన్ పనులు ప్రారంభమయ్యాయని, ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తిగా ముగుస్తాయని తెలిపారు. కాగా, మూడు రోజుల్లో బాధితులందరికీ ఆర్థిక సాయం అందించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా చెప్పినట్లు మంత్రులంతా ఐదు గ్రామాల్లో ఈ రోజు రాత్రి బస చేయాలని ఆయన చెప్పారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ రూ.10 వేలు ఇవ్వాలని జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు సేకరించే పనిని వాలంటీర్లకు అప్పజెప్పాలని కోరారు. రాష్ట్రమంతటా వున్న పరిశ్రమల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.
విశాఖలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో కొందరి కుటుంబాలకు ప్రకటించిన నష్ట పరిహారాన్ని ఏపీ మంత్రులు ఈ రోజు ఉదయం అందజేశారు. గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఈ రోజు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున చెక్కులు అందజేశారు. వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్లు సిద్ధం కానందున మిగిలిన నలుగురికి తర్వాత అందజేస్తారు.
అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ లో ఒక టన్ను స్టిరీన్ కూడా ఉండేందుకు వీలు లేదని ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. స్టిరీన్ ను తరలించేందుకు ప్రభుత్వం రెండు కంటైనర్ షిప్స్ ను ఏర్పాటు చేసిందని, ఒక కంటైనర్ షిప్ లో 8,500 టన్నులు లోడ్ చేయడం ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. స్టిరీన్ తరలింపు ప్రక్రియకు ఇంకా ఐదు రోజులు పడుతుందన్న నిపుణుల సూచనను ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు చెప్పారు. మొత్తం స్టిరీన్ ను దక్షిణ కొరియాకు తరలిస్తున్నారని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారని వివరించారు.
ఎల్జీ పరిశ్రమను తరలించాలన్న స్థానికుల, విపక్షాల డిమాండ్ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కంపెనీ తెరవొద్దని సూచించారు. నిపుణుల నివేదిక వచ్చేంత వరకు వేచి చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ప్రమాదం సమయంలో చోటుచేసుకున్న నష్టం, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి వివరించింది.