పెళ్లికి అడ్డం పడుతున్నాడని హతమార్చిన యువతి

by srinivas |   ( Updated:2020-02-26 04:15:13.0  )

తన వివాహానికి అడ్డుతగులుతున్నాడని ప్రియుడ్ని యువతి హతమార్చిన ఘటన కడపలో కలకలం రేపింది. కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా సిద్దవటం మండలం టక్కోలి గ్రామానికి చెందిన సాల శ్రీనివాసులు (29) కడప అప్సర కూడలి వద్ద ఉన్న ఓ నర్సింగ్‌ హోంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన సుమతితో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వారికి 11 నెలల కుమారుడున్నాడు. శ్రీనివాసులు అదే నర్సింగ్‌హోంలో పని చేస్తున్న సుజనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఆమెతో వేరే వ్యక్తులకు కూడా సంబంధం ఉందని శ్రీనివాసులు ఆమెతో గొడవ పడేవాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకునేది. ఐదు రోజుల కిందట ఆమెకు కడపకు చెందిన యువకుడితో వివాహ నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి శ్రీనివాసులు ఆమెతో ఘర్షణపడేవాడు. పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానంటూ బెదిరింపులకు దిగేవాడు. గత రాత్రి కూడా ఈ విషయంలో వారి మధ్య ఇదే విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వివాహం చేసుకుంటే ఉరేసుకుంటానని శ్రీనివాసులు ఆమెను భయపెట్టాడు.

ఎక్కడ తన పెళ్లికి అడ్డం వస్తాడోనని ఆందోళనతో శ్రీనివాసులు మెడకు చీర బిగించి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించింది. వేకువజాము 4 గంటల సమయంలో ఆసుపత్రి వర్గాలు శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలిని విభిన్న కోణాల్లో పరిశీలించి హత్యగా తేల్చారు. రాత్రి 12.30 నుంచి 2 గంటల వరకు సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్‌ అయ్యాయని విచారించారు. అయితే ఆమె ఒక్కరే అతనిని హత్య చేయడం కుదరదని, సీసీ కెమెరాలు ఆపడంలో ఎవరి పాత్రైనా ఉందా? అంటూ దర్యాప్తు ఆరంభించారు.

Advertisement

Next Story

Most Viewed