ప్రియుడిపై దాడిచేసి ఆత్మహత్యాయత్నం చేసిన యువతి

దిశ, ఏపీ బ్యూరో: వివాహానికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం ఇంగ్లీష్‌పాలేనికి చెందిన మాగంటి నాగలక్ష్మి మచిలీపట్నంలోని ఓ ప్రయివేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్ కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయమై, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ ఇటీవల వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామని నాగలక్ష్మి ఒత్తిడి చేస్తుండడంతో పవన్ కుమార్ నిరాకరించడంతో మాటామాట పెరిగింది. బతకాలనుకుంటే పెళ్లి చేసుకుందామని, లేదంటే ఇద్దరమూ చచ్చిపోదామని నాగలక్ష్మి గట్టిగా హెచ్చరించింది. దీనికి పవన్ నిరాకరించడంతో అతనిపై దాడి చేసి, నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో పవన్ పోలీసులకు ఫోన్ చేయగా, వారు వచ్చి ఇద్దరినీ వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. పవన్‌కు గాయాలు కావడంతో చికిత్స చేసిన వైద్యులు, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. యువతి అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చిన తరువాత కేసుపై పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement