నిన్న బెదిరింపులు.. నేడు పొగడ్తలు: ట్రంప్ భిన్న వైఖరి

by Shamantha N |   ( Updated:2020-04-08 04:14:34.0  )
నిన్న బెదిరింపులు.. నేడు పొగడ్తలు: ట్రంప్ భిన్న వైఖరి
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తనకు అనుకూలంగా వ్యవహరిస్తే పొగడ్తలతో ముంచెత్తుతాడు. వ్యతిరేక చర్యలు దిగితే విమర్శిస్తాడు. బెదిరింపులకు దిగుతాడు. కొవిడ్-19 వైరస్ విజృంభించడంతో అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు చేరుకున్నాయి. మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సోమవారం బెదిరింపులకు దిగాడు. మలేరియా నివారణ మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై భారత్ నిషేధం ఎత్తివేయకపోతే ‘ప్రతీకార’చర్యలు తప్పవన్నారు. అయితే, మన దేశం మానవతా దృక్పథంతో స్పందించి 20 రకాల ఔషదాలపై నిషేధం ఎత్తివేసింది. అవసరమైన అన్ని దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై భారత్ నిషేధం ఎత్తివేడయంతోనే అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. గుజారాత్‌లో మూడు ఔషద పరిశ్రమల నుంచి మొదటి విడతగా అమెరికాకు 2.90 కోట్ల డోస్‌ల మందులు సరఫరా కానున్నాయి. మొదటి విడత ఔషదాలు వస్తున్నాయని ప్రకటించిన ట్రంప్.. నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘దాదాపు 2.90 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులను కొనుగోలు చేస్తున్నాం. నేను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఔషదాలు వస్తున్నాయి. నా కోరిక మేరకు వాటిని పంపిస్తున్నారు. మోడీ చాలా గొప్పోడు. ఎంతో మంచివాడు’ అని ట్రంప్ పేర్కొన్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలలో 70 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. ప్రతి ఏటా సుమారు 200 కోట్ల 200 ఎంజీ మాత్రలను మన దేశం ఉత్పత్తి చేస్తోంది. కొవిడ్-19కు హైడ్రాక్సీ క్లోరో క్విన్ ద్వారా చికిత్స అందించవచ్చని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ భావిస్తోంది. గత నెల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ కూడా ఇలాంటి ప్రతిపాదనే ఒకటి చేసింది. కొవిడ్-19 బాధితులను గుర్తించడానికి వెళ్లే ఆరోగ్య కార్యకర్తలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఇవ్వాలని సూచించింది. ఈ పరిణామాల క్రమంలో మార్చి 25న భారత ప్రభుత్వం మలేరియా నివారణ మందుల ఎగుమతిపై నిషేధం విధించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మానవతా దృక్పథంతో హైడ్రాక్సీ క్లోరో క్విన్ మాత్రలకు ఎగుమతి అనుమతి ఇస్తున్నట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. మన దేశ అవసరాలకు సరిపోయిన తర్వాతనే ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.

Tags: coronavirus hydroxychloroquine drug really great donald trump on pm after shipment of key covid-19

Advertisement

Next Story