- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబును ఉతికారేసిన రాయలసీమ నాయకులు..
దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమకు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బాబు రాయలసీమకు ఏం చేశారు? రాయలసీమకు, రైతుకు ఎవరు న్యాయం చేశారో కమ్మభవన్‌లో సదస్సు పెట్టే ముందే టీడీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుండేది. రాయలసీమకు టీడీపీ చేసిన ద్రోహం రైతులు ఎప్పటికీ మరచిపోరు. టీడీపీ హాయంలో ప్రాజెక్టుల పేరుతో నిధులు భోంచేశారు. 9 ఏళ్ళలో హంద్రీ-నీవాకు బాబు ఖర్చు చేసింది రూ. 9 కోట్లే. హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసింది బాబు కాదా..? 2004లో డా. వైయస్ఆర్ సీఎం కాకపోయి ఉంటే సీమకు చుక్కనీరు వచ్చేది కాదు. ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి దోచుకున్నది మీరు కాదా..? రైతు బాగుండాలని కోరుకునేది ఒక్క వైయస్ కుటుంబమే. చిన్న నీటి గుంటలకు జలహారతులు ఇచ్చి, రెయిన్‌గన్‌లతో చంద్రబాబు ఎలా మోసం చేశాడో సీమ ప్రజలు మరిచిపోరు అని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా కమ్మభవన్‌లో శనివారం జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల సదస్సుకాదు.. టీడీపీ నిరుద్యోగుల సదస్సు : మంత్రి శంకరనారాయణ
కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటూ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సదస్సుపై మంత్రి శంకరనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సదస్స టీడీపీ నిరుద్యోగులు సదస్సు అంటూ విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, సీమ రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. 14 ఏళ్ళ చంద్రబాబు పాలనలో రాయలసీమ సాగునీటి, తాగు నీటి ప్రాజెక్టులపై ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలోనే అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా పథకానికి రాయలసీమకు చెందిన చంద్రబాబే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి హంద్రీ-నీవా కోసం కేవలం రూ. 9 కోట్లు ఖర్చు పెట్టాడు. అదికూడా సాగు నీటి పథకంగా ఉన్న హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో 300 పైగా చెరువులకు.. అనంతపురం నుంచి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చామని మంత్రి శంకరనారాయణ వెల్లడించారు.
చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా దుర్భిక్షమే : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
టీవీల్లో, పత్రికల్లో కనిపించేందుకే రాయలసీమ టీడీపీ నేతల సదస్సు నిర్వహించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలో 4 రిజర్వాయర్లు, కళ్యాణ దుర్గంలో ఒక రిజర్వాయర్, ధర్మవరంలో ఒక రిజర్వాయర్‌తోపాటు అన్ని నియోజకవర్గాల్లో చెరువులను నింపే కార్యక్రమం చేస్తున్నామన్నారు. పుట్టపర్తిలో రూ. వెయ్యి కోట్లతో 193 చెరువులను నిర్మించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో వర్షాలు ఆగిపోతాయి, రిజర్వాయులు, డ్యాములు ఎండిపోతాయి, ఎక్కడ చూసినా దుర్భిక్షం తాండవిస్తుంది. అన్నం పెట్టే రైతులు అన్నమో రామచంద్రా అంటూ వలసలు పోతారు. పశువులు కబేళాలకు వెళతాయంటూ ఘాటుగా విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఈరోజు ఎక్కడ చూసినా వాగులు, వంకలు పారుతున్నాయి. డ్యాములు నిండాయి. జలకళ సంతరించుకుంది. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారని ఎంపీ మాధవ్ తెలిపారు.
రాయలసీమ ప్రాజెక్టులపై విషం కక్కేది టీడీపీయే : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
రాయలసీమలో టీడీపీ ఉనికి కోసమే సదస్సు పెట్టారే తప్ప రాయలసీమ ప్రాజెక్టుల కోసం కాదని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని టీడీపీ నేడు 18-19 ప్రాజెక్టులు చేపట్టాలని తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. వైఎస్ మరణం తర్వాత ప్రాజెక్టు అంచనాలను 200-300 రెట్లు పెంచుకుని బొక్కేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వకూడదని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏపీకి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఏనాడైనా టీడీపీ నేతలు మాట్లాడారా అని విమర్శించారు.
పైగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలను ఢిల్లీ పంపి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకునేందుకు కుట్ర పన్నింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు ఇప్పటి వరకు కుప్పంకు నీళ్లు తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. సొంత జిల్లాకు నీళ్ళు తేలేని చేతగాని చవట, దద్దమ్మ చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. రాయలసీమకు జలకళను తీసుకువచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణ టిఆర్ఎస్ నేతలతో టీడీపీ నేతలు గొంతులు కలిపి మాట్లాడుతున్నారు. ఇదేనా టీడీపీ చిత్తశుద్ధి..? టీడీపీ విధానం ఎలా ఉందంటే..”నాకు దక్కనిది.. ఎవరికీ దక్కకూడదన్నట్టు”గా వ్యవహరిస్తుంది. రాయలసీమ రైతులు ఇంకా దుర్భిక్షంతోనే నరకయాతన అనుభవించాలన్న శాడిజంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు.