ఇది కేవలం ట్రైలరే.. సినిమా ఇంకా ముందుంది: రోజా

by srinivas |
YCP MLA Roja
X

దిశ, ఏపీ బ్యూరో: ఇది కేవలం ట్రైలరేనని.. సినిమా ఇంకా ముందుందని ఏపీ ఐఐసీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆమె మాట్లాడుతూ.. విజిలెన్స్ అధికారుల విచారణ మేరకే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు. ఈ అరెస్టుపై టీడీపీ నేతలు స్వాతంత్ర్య సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలియకుండా అచ్చెన్నాయుడు వ్యవహారం నడిపారని, పలానా కంపెనీతో ఎంఓయూ చేసుకోవాలంటూ లెటర్ హెడ్ మీద సంతకాలు కూడా చేశారని ఆమె తెలిపారు.

150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా రుజువైందని ఆమె అన్నారు. ఏడాది కాలంలో మీరు ఏం చేశారంటూ నారా లోకేశ్ తొడ కొట్టారని… ఇప్పుడు స్టార్ట్ అయిందని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్ కూడా కటకటాల వెనక్కి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. అచ్చెన్నను అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్నారని, తప్పు చేసిన వారు బీసీనా, ఓసీనా అనేది ఉండదని… ఎవరైనా అనుభవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సీఎం కట్టుబడి ఉన్నారన్న ఆమె, అచ్చెన్నాయుడి అరెస్ట్ కు, జగన్ కు సంబంధం లేదని తెలిపారు. అచ్చెన్నాయుడు వంటి అవినీతి తిమింగలాలు జైలుకు వెళ్లాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Next Story