600 మంది కంటే ఒక్కరు ఎక్కువ ఉన్నా రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సవాల్

by srinivas |   ( Updated:2021-12-02 06:14:21.0  )
kakani
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రకు కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల యాత్రను చంద్రబాబు నాయుడే దొంగచాటుగా నిర్వహిస్తున్నారంటూ కాకాణి ధ్వజమెత్తారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటే.. అన్ని నియోజకవర్గాలు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదంటూ సెటైర్లు వేశారు. మహా పాదయాత్ర రాజకీయ యాత్రగా మారిందంటూ విమర్శించారు.

మహాపాదయాత్రను తాను అడ్డుకున్నానంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. యాత్రను అడ్డుకోవాలని అనుకుంటే అస్సలు తన నియోజకవర్గంలో యాత్రే చేయలేరనీ.. ఎక్కడికక్కడే అడ్డుకొని ఉండేవారమని వ్యాఖ్యానించారు. ఆడపడుచులంటే తమకు గౌరమన్న ఆయన అందరి అభిమతాలను గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. అడ్డంకులు సృష్టిస్తున్నామంటూ తమపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి అన్నారు.

సోమిరెడ్డి ఓ శనిలా దాపురించాడు..

మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపైనా ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విరుచుకుపడ్డారు. సోమిరెడ్డి వల్లే సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకు చోటు దొరకలేదని ఆరోపించారు. సోమిరెడ్డికి ఉన్న పరపతి ఏంటో.. రైతులే అర్థం చేసుకోవాలన్నారు. సోమిరెడ్డి టెంట్‌ వేయిస్తే అందరూ తీసేయండంటూ సూచించారని అది అతడి క్రెడిబిలిటీ అంటూ సెటైర్లు వేశారు. సోమిరెడ్డి, ఆయన మనుషులకు సర్వేపల్లి నియోజకవర్గంలో పచ్చినీళ్లు కూడా పుట్టని పరిస్థితి.. అలాంటిది బస చేసేందుకు 10 సెంట్ల భూమి దొరుకుతుందా అంటూ ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి మొహం చూసి ఎవరిస్తారు..? అమరావతి రైతులు ఎవరైనా ముందుకు వచ్చి మాకు బస కావాలని అడిగారా..? సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డికి ఉన్న అపఖ్యాతి మరొకరికి లేదన్నారు.

మరోవైపు చేజెర్ల, తోడేరు,పొదలకూరులో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని కొన్ని పత్రికలు రాశాయని ఎవరూ బ్రహ్మరథం పట్టలేదన్నారు. మహాపాదయాత్రలో 600మంది కంటే ఎక్కువ ఉంటే తాను రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. వీడియో క్లిపింగ్స్ చూడాలని.. ఒకవేళ ఆరువందల మంది కంటే ఒక్కరు ఎక్కువగా ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed