వైసీపీ నేత దారుణ హత్య.. కారణమేంటి?

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత హత్య స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం మచిలీపట్నం చేపల మార్కెట్‌కు వెళ్లిన మోకా భాస్కరరావును ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో భాస్కరరావు అక్కడికక్కడే కుప్పకూలడంతో స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, గుండెకు బలమైన గాయం కావడంతో భాస్కర రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో వైసీపీ శ్రేణులు బారీ ఎత్తున్న ఆస్పత్రికి చేరుకొని నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా బారీగా మోహరించడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

సీపీ ఫుటేజీ ఆధారంగా హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు మొత్తం నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ హత్యలో పాల్గొన్నారని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. ఒకే బైక్ పై వచ్చిన వారిద్దరిలో ఒకరు బైక్ మీద నుంచి దిగి.. కత్తితో భాస్కరరావును పొడిచినట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. ఆ తర్వాత వెంటనే తిరిగి బైక్ ఎక్కి పరారైయ్యారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. పాత కక్షలతోనే హత్య చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పక్కా ప్రణాళికతోనే భాస్కరరావు హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement