జిన్‌పింగ్‌తో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ రహస్య ఫోన్ సంభాషణ

by vinod kumar |
జిన్‌పింగ్‌తో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ రహస్య ఫోన్ సంభాషణ
X

బీజింగ్/జెనీవా: కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై పలు దేశాలు చేస్తున్న ఆరోపణల వెల్లువ ఇంకా ఆగడం లేదు. కరోనా విషయంలో చైనాకు డబ్ల్యూహెచ్‌వో లోపాయికారిగా సహకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఒక పత్రిక ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. జనవరి 21న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ట్రెడోస్ అధనోప్ ఫోన్లో రహస్యంగా మాట్లాడారని సదరు పత్రిక ఒక వార్తను ప్రచురించింది. జిన్‌పింగ్ ఒత్తిడి చేయడం వల్లే డబ్ల్యూహెచ్‌వో కరోనా వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ఆలస్యం చేసిందని ఆ కథనంలో పేర్కొంది. జనవరిలో జరిగిన ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన అన్ని వివరాలు జర్మనీ నిఘా సంస్థల దగ్గర ఉన్నాయని కూడా పత్రిక ఉటంకించింది. కరోనా గురించి అప్పుడే ప్రపంచానికి చెప్పొద్దని.. దీన్ని మహమ్మారిగా అప్పుడే ప్రకటించొద్దని జిన్ పింగ్ కోరినట్లు ఆ కథనంలో తెలిపారు. ఆయన కోరిక మేరకే డబ్ల్యూహెచ్‌వో కరోనాపై సరైన సమయానికి ప్రకటన చేయలేదని జర్మన్ పత్రిక తెలిపింది. చైనా కోరిక మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు వారాల తర్వాత మాత్రమే కరోనాను మహమ్మారిగా ప్రకటించిందని.. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పింది. ఈ కథనంతో అమెరికా సహా పలు దేశాలు చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. ముందుగానే వైరస్ గురించి హెచ్చరించి ఉంటే ఇప్పటి కంటే నష్టం చాలా తక్కువగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ కథనంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కథనం నిరాధారమైందని సంస్థ తెలిపింది. అసలు జనవరి 21న జిన్‌పింగ్-అధనోమ్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. జిన్‌పింగ్‌తో జనవరి 21నే కాదు అసలు ఎప్పుడూ ఫోన్‌లో సంభాషణలు జరపలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇలాంటి అబద్దపు కథనాలు ప్రచురించడం ద్వారా కరోనాపై పోరాటం చేస్తున్న దేశాల మధ్య విభేదాలు ఏర్పడతాయని సంస్థ మండిపడింది. ఈ ఏడాది జనవరి 20నే కరోనా మనుషుల నుంచి మనిషికి సంక్రమిస్తుందనే విషయాన్ని వెల్లడించిందని గుర్తు చేసింది. చైనా ఆ సమాచారం ఇచ్చిన వెంటనే రెండు రోజుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిందని.. ఆనాటి నుంచే అన్ని రకాల కట్టడి చర్యలను సంస్థ ప్రారంభించిందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed