శ్రమ విలువ

పొద్దుగాల్నె ఫోన్ మోతతో
దిగ్గున లేచిన…
మెత్తకింద పెట్టుకున్న
మొబైల్ తీసి ఎత్తిన..

అవతలి వైపు హలో సార్
నేను నాగరాజును
బడికి డుమ్మలు కొట్టి
సార్లచేత దద్దమ్మ
అనిపించుకున్నోన్ని.!

ఇప్పుడు ఇటుక బట్టిలో
పని చేస్తున్న
ఇద్దరు బిడ్డల తండ్రిని
పనిచేసేటోడే గొప్పోడని
మీరు చెప్పిన”శ్రమ విలువ”
యాదికచ్చింది.!

ఈ రోజు టీచర్స్ డే కదా
శుభాకాంక్షలు సార్…
మొస మర్రకుండా
ఆ పిల్లాడు చెప్పే మాటలు
మౌనంగా ఇన్న.

మంచి చెడ్డ అరుసుకొని
ఇంటికి రమ్మని అడ్రస్ చెప్పిన
ఆ ఎందుకులే సార్
కూలినాలి చేసుకునేటోన్నని
ఫోన్ కట్‌చేసిండు.!

ఏ బ్యాచ్ విద్యార్థి అని
మనసు పొరలు తవ్విన.!

తొమ్మిదో తరగతి దాక
అడపాదడపా బడికచ్చి
పదో తరగతిలోకీ….
ప్రమోట్ కాని పిల్లాడు.!

పదిల్లన్న సక్కగ
బడికచ్చి సదువుకో
బతుకు బాగు పడుద్దని
ఇంటికి బోయి…
తోలుకచ్చిన పిల్లాడు.!

అయ్య సారకు బానిసైతే
ఇల్లు గడవనీకి
ఆవ్వకు తోడుగ
పనిల కుదిరినోడు.!

డ్రాపౌట్ కాకుండా
పెద్ద సారును ఒప్పించితే
తిప్పలబడి పది పరీక్షలు
రాసి పాసైనోడు.!

పాస్ సర్టిఫికెట్
తీసుకున్నరోజు
మురిసిపోతూ
పాదాభివందనం
చెయ్యబోతే,వద్దని వారిస్తే
చిన్న బుచ్చుకున్నోడు.!

“వ్వక్తిని గౌరవించు
కానీ, పూజించకని”
మందలించి గుండెలకు
హత్తుకున్న పిల్లాడు.!

ఏండ్లు గడిచిన
చెప్పిన శ్రమ విలువ
ఆచరిస్తున్న..
ఆదర్శ మానవుడు.!

-చిలువేరు అశోక్,

(శ్రమ విలువను‌ బోధిస్తున్న అధ్యాపకులందరికీ అంకితం..)

Advertisement