కరోనాపై ప్రపంచదేశాల యుద్ధనాదం!

by Shyam |
కరోనాపై ప్రపంచదేశాల యుద్ధనాదం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను అనేక దేశాలు ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు పలు విధానాలను అనుసరించి చర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి కరోనా వైరస్‌పై ఎలాంటి యుద్ధ నిర్ణయాలను తీసుకున్నాయో పరిశీలిద్దాం!

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్

డిపాజిట్ రేటు కంటే మైనస్ 0.75 శాతం తక్కువరేటుతో బ్యాంకులకు ఇచ్చే రుణాలను మైనస్ 0.5 శాతంతో ఈసీబీ అందిస్తోంది. కార్పొరేట్ రుణాలపై దృష్టి సారించి ఈ ఏడాది బాండ్ల కొనుగోళ్లను 120 బిలియన్ యూరోలకు పెంచింది. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు కొరత లేకుండా ఈసీబీ పరిధిలోని బ్యాంకులు కీలక మూలధనం, నగదు అవసరాలకు తగినట్టుగా వ్యవహరిస్తున్నాయి. అయితే, యూకే, యూఎస్ దేశాలు తీసుకున్నట్టుగా ఈసీబీ వడ్డీ రేట్లను తగ్గించడాన్ని నిర్లక్ష్యం చేసింది. దీనికి ప్రభుత్వాలదే బాధ్యతని తేల్చేసింది.

అమెరికా:

ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు యూఎస్ ట్రెజరీ విభాగం వ్యాపారాలకు వడ్డీలు, జరిమానాల చెల్లింపులను వాయిదా వేసింది. ఆర్థిక వ్యవస్థకు సుమారు 200 బిలియన్ల కంటే అధికంగా అదనపు ద్రవ్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా వైరస్ ప్రభావిత రాష్ట్రాల్లో చిన్న వ్యాపారాలకు తక్కువ వడ్డీ రుణాలు అందించే ప్రక్రియను తక్షణమే అమల్లోకి తెచ్చారు. కొన్ని మినహాయింపులతో యూరప్‌కు ముప్పై రోజులపాటు అన్ని రకాల ప్రయాణాలను నిలిపేశారు. ఈ చర్యల కంటే ముందు కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ట్రంప్ రూ. 61.4 వేల కోట్ల విలువైన అత్యవసర ఖర్చుల బిల్లుపై సంతకం చేశారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించింది.

చైనా :

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం తక్షణమే రూ. 1.18 లక్షల కోట్లను కేటాయించింది. వైరస్ బాధిత ప్రాంతాలకు నిధుల సహకారాన్ని పెంచింది. చైనా సెంట్రల్ బ్యాంక్ రుణాల రేటుతోపాటు పలు కీలకమైన రేట్లను తగ్గించింది. కొన్ని సంస్థలకు చౌకగా రుణాలను, చెల్లింపుల్లో ఉపశమనాలను ఇవ్వాలని చైనా ప్రభుత్వం బ్యాంకులను కోరింది. కరోనా వల్ల దెబ్బతిన్న ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కంపెనీలకు పూర్తిగా సహకరించడానికి చర్యలు చేపట్టాయి.

ఇటలీ:

కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఇటలీ ప్రభుత్వం సుమారు రూ.65 వేల కోట్లను కేటాయించింది. ఈ ఏడాది లోటు లక్ష్యాన్ని ప్రస్తుతమున్న 2.2 శాతం నుంచి జాతీయ ఉత్పత్తిలో 2.5 శాతానికి పెంచింది. తాకట్టు పెట్టిన వాటిపై చెల్లింపులను దేశవ్యాప్తంగా నిలిపేశారు. ఇటాలియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వైరస్‌ను ఎదుర్కోడానికి దేశవ్యాప్తంగా సంస్థలకు, గృహాలకు ఇచ్చే రుణాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది.

జపాన్:

కరోనాను అడ్డుకునేందుకు జపాన్ సుమారు రూ. 40 వేల కోట్ల విలువైన చర్యలను చేపట్టేందుకు రెండో ప్యాకేజీని విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థకు రాబోయే రోజుల్లో నష్టాలను తగ్గించుకునేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు సహకరించడంపై దృష్టి పెట్టింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ హరుహికో మార్కెట్లలో ద్రవ్య లభ్యతను పెంచుతామని ప్రకటించారు.

జర్మనీ:

జర్మనీ ప్రభుత్వం 2024 నాటికి ప్రభుత్వ పెట్టుబడులను రూ. 91.7 వేల కోట్ల వరకూ పెంచేందుకు అంగీకరించింది. కరోనా మహమ్మారి వల్ల కార్మికుల పనిగంటలు తగ్గాయి. దీన్ని అధిగమించడానికి కంపెనీలకు సబ్సీడీలు పొందే ప్రక్రియను సులభతరం చేసింది. కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలా లేదా అనే అంశంపై జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్‌కూ, సంప్రదాయవాదులకూ మధ్య విభేదాలు వచ్చాయి.

బ్రిటన్:

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించిన కొన్ని గంటలకే బ్రిటన్ కరోనా వైరస్ వల్ల కలిగే మాంద్యాన్ని నివారించడానికి రూ.2.88 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీకి సంబంధించిన ఆర్థిక ప్రణాళికను వెల్లడించింది.

ఫ్రాన్స్:

పన్ను చెల్లింపులను నిలిపేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం కంపెనీలను కోరింది. నగదు లభ్యత విషయంలో సమస్యలను అధిగమించడానికి అవసరమైన రుణాలపై హామీ ఇవ్వాలని స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకును ఆదేశించింది.

ఇండియా:

రెండో విడత దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ద్వారా కొత్తగా నగదు లభ్యతను వ్యవస్థలో ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు చెప్పారు. మార్కెట్లను ఆదుకోవడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్‌బీఐ ప్రకటించింది. మార్చి చివరినాటికి సుమారు రూ. 35 లక్షల కొట్ల రుణాలను ఆమోదించాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కెనడా:

కెనడాలో ఇటీవల మొదటి కరోనా మరణం నమోదైంది. దీంతో రాబోయే రోజుల్లో ముడి ఉత్పత్తికి తీవ్రమైన ప్రభావం ఉండనుందనే అనుమానాలతో కెనడా ప్రభుత్వం తగిన కార్యక్రమ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని గతవారం ఆర్థికమంత్రి బిల్ మోర్నీ చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి బ్యాంక్ ఆఫ్ కెనడా కీలకరేట్లను 1.75 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గించింది. ఏప్రిల్‌లో మరోసారి తగ్గింపులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

దక్షిణ కొరియా:

చైనా తర్వాత కరోనా వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమైన రెండోదేశం దక్షిణ కొరియా. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం రూ.72.5 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అదనంగా మరిన్ని నిధులను సమకూర్చేందుకు సుమారు రూ.60 వేలకోట్ల వులువైన ట్రెజరీ బాండ్లను జారీ చేసింది. సియోల్‌లో మూడు నెలలపాటు అమ్మకాలపై కఠినమైన నిబంధనలను అమలు చేసింది.

tags : china, coronavirus, coronavirus spread, COVID-19, india, USA

Advertisement

Next Story

Most Viewed