- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధంలో పుతిన్ గెలిస్తే ఏం జరుగుతుంది?.. నాటో దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కామెంట్స్
దిశ, నేషనల్ బ్యూరో: రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా సాయం క్రమంగా క్షీణిస్తోంది. దాదాపు రెండేళ్లపాటు సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధం.. ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో నాటో దేశాలు పెద్ద ఎత్తున సాయం చేయగా, ఇప్పుడవి చేతులెత్తేస్తూ వస్తున్నాయి. ఆర్థిక భారం పెరుగుతుండటంతో ఉక్రెయిన్‌కు సాయం తగ్గుతూ వస్తోంది. రష్యా పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో పాశ్చాత్య దేశాలను ఇప్పుడు ఓ భయం తీవ్రంగా కలవరపెడుతోంది. అదే.. ‘ఈ యుద్ధంలో పుతిన్ గెలిస్తే పరిస్థితి ఏంటి’ అనే భయం. దీనిపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధంలో రష్యా గెలిస్తే, అది కేవలం ఉక్రెయిన్‌పైనే ప్రభావం చూపదని, పుతిన్ విజయం పశ్చిమ దేశాలకు ఒక విపత్తులా పరిణమిస్తుందని, అది క్రమంగా ప్రపంచం మొత్తానికీ వ్యాపిస్తుందని బ్రిటన్ రక్షణ, భద్రతకు సంబంధించిన మేథో సంస్థ ‘రుసి’ అసోసియేటెడ్ ఫెలో, యుద్ధ నిపుణుడు ఒలెస్కాండర్ డానిల్యుక్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా గెలిస్తే ‘నాటో’ పతనం ఖాయమని, ఆర్థిక మారణహోమం తప్పదని యూఎస్ రిటైర్డ్ జనరల్ బెన్ హోడ్జెస్ వెల్లడించారు. అంతేకాకుండా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా సహా శత్రుదేశాల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
‘ప్రపంచమంతా రక్తపాతమే..’
‘అమెరికా, పశ్చిమ దేశాలపై పేచేయి సాధించగలమని నిరంకుశవాదులు భావిస్తే అణుయుద్ధం తప్పకపోవచ్చు. ప్రపంచం రక్తపాతంలో మునిగిపోతుంది’ అని డానిల్యుక్ అంచనా వేశారు. ‘ఒక విజయం ప్రపంచంలో పెద్ద విపత్తుకు కారణమవుతుంది. ఇది ఐరోపా, యూఎస్ అంతటా నివసిస్తున్న పౌరులకు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుంది’ అని చెప్పారు. ఆ ఒక్క విజయమే ప్రపంచ సైనిక శక్తి అమెరికా అన్న దృక్పథాన్ని మార్చివేయొచ్చని, చైనా, ఇరాన్, నార్త్ కొరియా వంటి దేశాల సైనిక విస్తరణ మరింత పుంజుకోవచ్చని డానిల్యూక్ తెలిపారు. అంతర్జాతీయ భద్రతా మధ్యవర్తి స్థానాన్ని అమెరికా కోల్పోతుందని చెప్పారు. ఇదే విషయాన్ని యూఎస్ ఆర్మీ మాజీ కమాండింగ్ జనరల్ హెడ్జెస్ సైతం అంగీకరించారు.
‘రష్యా బలగం పెరుగుతుంది’
ఉక్రెయిన్‌పై విజయంతో రష్యాకు మిత్ర దేశాల సంఖ్య పెరుగుతుందని హెడ్జెస్ తెలిపారు. ఆ తర్వాత ఇరాన్, నార్త్ కొరియా దేశాలు త్వరలోనే న్యూక్లియర్ బాంబుల సంఖ్యను పెంచుకుంటాయని, ఇది పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష ముప్పును కలిగించడమేకాకుండా అణు యుద్ధానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. రష్యా విజయం సాధిస్తే ఉగ్రవాదం జడలు విప్పుకుంటుందని, ఐరోపా వీధుల్లో టెర్రర్ అటాక్స్ పెరుగుతాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా తన ఉడుం పట్టును బిగిస్తున్నకొద్దీ పశ్చిమ దేశాలు అస్థిరతలోకి జారుకుంటాయని తెలిపారు. ఆ తర్వాత నాటో గడ్డపైనా రష్యా దాడులు చేస్తుందని హెచ్చరించారు. నాటోకు రిపబ్లికన్ మద్దతు లేకపోవడంతో ఐరోపాపై దాడి చేయడానికి పుతిన్‌కు ట్రంప్ అధ్యక్ష పదవి మరింత తలుపులు తెరుస్తుందని ఆయన చెప్పారు. నవంబర్‌లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లయితే, అది నాటోను మరింత బలహీనపరుస్తుందని జనరల్ హోడ్జెస్ చెప్పారు. అప్పుడు పుతిన్ మరింత రెచ్చిపోతారని తెలిపారు. అప్పుడు, మూడో ప్రపంచ యుద్ధం మొదలు కావచ్చని సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు, యూఎస్ దళాల రక్షణ లేకుండా యూరోపియన్ దేశాలు రష్యా వంటి దేశాల నుంచి తమను తాము రక్షించుకోలేవని డానిల్యుక్ చెప్పారు. కాబట్టి, నాటో దేశాలను రక్షించుకోవడానికి ఏమాత్రం సంకోచించినా, అది కూటమి విచ్ఛిన్నానని దారితీస్తుందని హోడ్జెస్ వెల్లడించారు.