Global warming: అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిన జులై

by Harish |   ( Updated:2024-08-08 13:05:47.0  )
Global warming: అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిన జులై
X

దిశ, నేషనల్ బ్యూరో: వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఎండలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై సర్వే చేసిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) నివేదికను యూరోపియన్ యూనియన్ క్లైమేట్ మానిటర్ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది(2024) జులై నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఇది 1940 నాటి నుంచి పోలిస్తే రెండో అత్యధికంగా వేడి నెలగా రికార్డులకెక్కింది.

జులై 2024 భూమి చూసిన రెండవ-హాటెస్ట్ నెలగా మారింది. ఈ నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.91 డిగ్రీల సెల్సియస్ కాగా, దీనికంటే ముందు, గత ఏడాది(2023) జులై నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండింటి మధ్య స్వల్ప తేడా 0.04 డి.సెల్సియస్ మాత్రమే. 2024 లో జనవరి నుండి జులై వరకు ప్రపంచ ఉష్ణోగ్రతలు 1991-2020 సగటు కంటే 0.70 డి.సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. 1850-1900 మధ్య కాలంలో అంచనా వేసిన సగటు ఉష్ణోగ్రతల కంటే జులై 2024లో ఉష్ణోగ్రత 1.48 డి.సెల్సియస్ ఎక్కువ.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో కూడా భారీగా పెరుగుదల కనిపిస్తుంది. జులై నెలలో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 20.88 డి.సెల్సియస్ కాగా, ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే కేవలం 0.01డి.సెల్సియస్ తక్కువ కావడం గమనార్హం. నివేదిక ప్రకారం, యూరప్‌లోని దక్షిణ, తూర్పు భాగాలు, పశ్చిమ US, పశ్చిమ కెనడా, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు, మధ్యప్రాచ్యం, ఆసియా, తూర్పు అంటార్కిటికాలో జులైలో సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శిలాజ ఇంధన పరిశ్రమల నుండి వస్తున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు అధిక ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమయ్యాయి.

Advertisement

Next Story