ఎర్ర సముద్రంలో మునిగిన బ్రిటన్ ఓడ!: ప్రమాదం పొంచి ఉందన్న యూఎస్

by samatah |
ఎర్ర సముద్రంలో మునిగిన బ్రిటన్ ఓడ!: ప్రమాదం పొంచి ఉందన్న యూఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి18న యూకేకు చెందిన రూబీమార్ అనే నౌకపై క్షిపణి దాడి చేశారు. నౌకలోని సిబ్బందిని బ్రిటన్ సైన్యం రక్షించినప్పటికీ ఓడ మాత్రం సముద్రంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. హౌతీలు అటాక్ చేసినప్పుడు ఆ ఓడ యెమన్‌లోని మోఖా పోర్ట్‌కు 27.78 కిలోమీటర్ల దూరంగా ఉండగా.. గత 12 రోజులుగా ఉత్తర దిశగా పయనించిందని.. అయితే సముద్రంలో తుపాను, ప్రతికూల వాతావరణం కారణంగా మునిగిపోయినట్టె యెమన్ తెలిపింది. ఓడలో ఎరువులు, ఇంధనం సహా ఇతర సామగ్రి ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 41,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఉన్నాయని యూఎస్ మిలిటరీ తెలిపింది. కాగా, గతేడాది నవంబర్‌లో హౌతీలు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిన తర్వాత కోల్పోయిన మొదటి నౌక ఇదే కావడం గమనార్హం.

సముద్ర జీవులకు ముప్పు!

ఎర్ర సముద్రంలో ఇంత పెద్ద మొత్తంలో ఎరువులు విడుదల చేయడం వల్ల సముద్రంలోని జీవులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని జోర్డాన్ యూనివర్సిటీలోని మెరైన్ సైన్స్ స్టేషన్ డైరెక్టర్ అలీ అల్-సవాల్మిహ్ తెలిపారు. ఇంధన లీకేజీపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాల ఓవర్‌లోడ్ కారణంగా జీవుల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఎర్ర సముద్రంలోని కలుషిత ప్రాంతాల పర్యవేక్షణ ఎజెండాను ఏర్పాటు చేయడానికి ఎర్ర సముద్రం గుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యవసర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. దక్షిణ ఎర్ర సముద్రంలో సహజమైన పగడపు దిబ్బలు, తీరప్రాంత మడ అడవులు, విభిన్న సముద్ర జీవులు ఉన్నట్టు వెల్లడించారు. కాగా, ఎర్ర సముద్రంలో హౌతీల నిరంతర దాడుల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed