Somalia: సోమాలియా రాజధానిలో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి

by Harish |
Somalia: సోమాలియా రాజధానిలో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీగా ఉండే బీచ్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. బీచ్‌లోని ఓ రెస్టారెంట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా 32 మంది మరణించారు, మరో 63 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన దాని ప్రకారం, ముష్కరుల్లో ఒకరు వంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. మిగతా ముష్కరులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారని తెలిపారు. భయంతో అందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. పేలుడు తీవ్రతకు బీచ్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురు కాల్పులు జరపగా, ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్‌ఖైదా అనుబంధం సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అల్-ఖైదా అనుబంధ గ్రూపు అల్ షబాబ్ చాలా సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. గత సంవత్సరంలో ఇదే బీచ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయారు. అంతకుముందు సోమాలియాలో అక్టోబర్ 2022లో రద్దీగా ఉండే మార్కెట్‌లో కారు బాంబు దాడి జరగ్గా 100 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారు. ఈ దాడికి కూడా అల్-షబాబ్, తీవ్రవాద ఇస్లామిస్ట్ గ్రూప్ బాధ్యత వహించింది.

Advertisement

Next Story