దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మరోసారి రమఫోసా..మద్దతు తెలిపిన డీఏ!

by vinod kumar |
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మరోసారి రమఫోసా..మద్దతు తెలిపిన డీఏ!
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమాఫోసా మరోసారి ఎన్నికవ్వడానికి రంగం సిద్ధమైంది. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ), ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన సంకీర్ణ ఒప్పందం తరువాత ఆయనను ప్రెసిడెంట్‌గా ఎన్నుకునే చాన్స్ ఉంది. సంకీర్ణ ప్రభుత్వానికి దేశంలో రెండో అతి పెద్ద పార్టీ అయిన డెమొక్రటిక్‌ అలయన్స్‌ (డీఏ) మద్దతిచ్చింది. ఆఫ్రికాలోని అత్యంత పారిశ్రామిక దేశాన్ని సహ-పరిపాలన చేసేందుకు ఏఎన్‌సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ పార్టీ నేత జాన్ స్టీన్ హుసేన్ తెలిపారు. ఎక్కువ సీట్లు గెలిచినందున రమఫోసా అధ్యక్షుడిగా ఉంటాడని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన రమాఫోసా.. సంకీర్ణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు.

కాగా, వర్ణ వివక్ష నుంచి 1994లో దక్షిణాఫ్రికా విముక్తి పొందిన తర్వాత వరుసగా ముప్పయ్యేళ్లపాటు ఏఎన్‌సీ పార్టీ అధికారంలో కొనసాగింది. కానీ గత నెలలో జరిగిన జాతీయ ఎన్నికల్లో మొదటి సారి మెజారిటీ కోల్పోయింది. ఏఎన్ సీకి 40 శాతం ఓట్లు రాగా, డీఏకు 22శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 400 సీట్లకు గాను ఏఎన్‌సీ 159, డీఏ 87, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా నేతృత్వంలోని పార్టీ 58, హార్డ్ లెఫ్ట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ 39, ఇంకాతా ఫ్రీడమ్ పార్టీ 17 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో అప్పటి నుంచి ఏఎన్‌సీ ఎవరితో భాగస్వామిగా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. దాదాపు రెండు వారాల తర్వాత డీఏ పార్టీ మద్దతుతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed