మరో దాడి చేస్తే ఇజ్రాయెల్ పతనం ఖాయం: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం వార్నింగ్

by samatah |
మరో దాడి చేస్తే ఇజ్రాయెల్ పతనం ఖాయం: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ భూభాగంపై మరోసారి దాడికి పాల్పడితే ఇజ్రాయెల్ సర్వనాశనం అవుతుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వార్నింగ్ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఏమి మిగులుతుందో కూడా ఊహించలేమని తేల్చి చెప్పారు. ఇరాన్ పై దాడి చేస్తే ఈ సారి తీవ్ర పరిణామాలు ఉంటాయని దాని ఫలితం భిన్నంగా ఉంటుందని తెలిపారు. మూడు రోజుల పాక్ పర్యటనలో ఉన్న ఇబ్రహీం రైసీ లాహోర్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఇజ్రాయెల్ మరోసారి పొరపాటు చేస్తే..అక్కడ ఏమీ మిగలదని, ఇది ఇజ్రాయెల్ పాలన పతనానికి కూడా దారి తీస్తుందని హెచ్చరించారు.

సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేయడం సరికాదని, అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని తెలిపారు. ఇరాన్, పాకిస్థాన్ ప్రజలు ఎంతో కాలంగా అణచివేయబడిన పాలస్తీనా దేశాన్ని రక్షించారని కొనియాడారు. పాలస్తీనాను సేఫ్ చేసేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. అమెరికన్లు, పాశ్చాత్య దేశాలు పిల్లలను చంపడం, మారణహోమం సృష్టించిన వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. గాజా ప్రజలు ప్రతిఘటిస్తేనే పాలస్తీనా విముక్తి సాధ్యమని తెలిపారు.

కాగా, ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయగా..దీనిని ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే మరోసారి భారీగా దాడి చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం రైసీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Advertisement

Next Story