కార్మిక శక్తిపై ప్రభుత్వాల శీతకన్ను!

by Shyam |
కార్మిక శక్తిపై ప్రభుత్వాల శీతకన్ను!
X

– కాగితాలకే పరిమితమైన చట్టాలు
– యూనియన్లను అణిచివేస్తోన్న పారిశ్రామికవేత్తలు

దిశ, మహబూబ్ నగర్: ‘మే డే’ (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) అంటే అన్ని సెలవుదినాల్లో ఇదొకటి కాదు. ప్రపంచవ్యాప్తంగా శ్రమదోపిడీకి గురైన కార్మికులు.. ఎనిమిది గంటల పనివిధానం కోసం నినదిస్తూ పోరాటానికి నాంది పలికిన రోజు (1886, మే 1). చికాగోలో మొదలైన పోరాటం ప్రపంచ దేశాలకు విస్తరించి కార్మిక విజయానికి బాటలు వేసిన రోజు. కార్మిక శక్తిని ప్రపంచానికి చాటిన రోజు. పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు. అయితే ఈ శతాబ్దానికి పైగా కాలంలో ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులకు నేటి పాలకులు, పారిశ్రామికవేత్తలు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. కార్మికులకు బాసటగా నిలిచే చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రపంచీకరణ యుగంలోనూ కార్మికులు తమ హక్కుల అమలు కోసం నేటికీ ప్రభుత్వాలతో పోరాడాల్సిన దుస్థితిలో ఉండటం దురదృష్టకరం.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్‌లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకల్పేందుకు నాయకులు, అధికారులు స్థానిక ప్రజలకు అనేక హామీలిచ్చారు. ప్రధానంగా జడ్చర్ల వద్ద వున్న పొలేలపల్లి సెజ్‌లో వివిధ రకాల మందుల పరిశ్రమలు నెలకొల్పేందుకు అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో వారికి ఉపాధి ఆశ చూపారు. తీరా పరిశ్రమలు స్థాపించిన తర్వాత.. పరిసర ప్రాంతాల ప్రజలను దినసరి కూలీలుగా మాత్రమే తీసుకుంటున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు, భవన నిర్మాణ రంగాల్లోనూ అనేక మంది కార్మికులు దినసరి కూలీలుగానే పనిచేస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకపోవడంతో.. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అందకుండా పోతున్నాయి. అంతేకాకుండా ఇక్కడి పరిశ్రమల్లో 8 గంటలు పని విధానం కూడా అమలు కావడం లేదని కార్మికులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సమగ్ర వేతన చట్టానికి దిక్కు లేదు. ఈ పరిశ్రమల్లో వెలువడే విషవాయువుల నడుమ పనిచేసే కార్మికుల జీవిత కాలం కూడా 50 నుంచి 55 ఏళ్ళకు మించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఈ పరిశ్రమల్లో సంభవించిన అనేక ప్రమాదాల్లో పదుల సంఖ్యల కార్మికులు మరణించినా పట్టించుకునే వారే కరువయ్యారు. పైగా తమ అంగబలంతో పరిశ్రమల్లో కార్మిక సంఘాలే లేకుండా చేస్తూ పారిశ్రామికవేత్తలు జాగ్రత్త పడుతున్నారు.

వీరి పరిస్థితి ఇలా వుంటే జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే వారిలో చాలా వరకు వలస కార్మికులే ఉండటం గమనార్హం. ఇలాంటి వివరాలు ఎప్పటికపుడు సేకరించాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. బట్టీ వ్యాపారులు వారిచేత రేయింబవళ్లు పనులు చేయిస్తూ.. వారికి పని ప్రదేశంలో కనీస వసతులు సైతం కల్పించడం లేదు. ఈ క్రమంలో కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో బట్టీల్లో పనిచేస్తూ అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటనలూ అనేకమున్నాయి. అయితే, వ్యాపారులతో కుమ్మకైన అధికారులు మాత్రం వారివి సహజ మరణాలుగానే చిత్రీకరించడం గమనార్హం.

జిల్లాలో కార్మికుల సంఖ్య ఇలా..

జిల్లాలో కార్మికుల విషయానికి వస్తే అసంఘటిత కార్మికులు 3.60 లక్షల మంది ఉండగా, భవన నిర్మాణ రంగంలో 1 లక్ష 89 వేల మంది, దుకాణాల్లో పని చేసే వారు 8 వేలు, హమాలీలు 27 వేలు, రైస్ మిల్లులో 1900 మంది, క్రషర్ మెషిన్ల వద్ద 1600, ఇతర పనుల్లో 15000, బీడీ కార్మికులుగా 25,200 మంది, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో 20 వేలు, ఆటో రిక్షా కార్మికులు 16 వేలు, ఇటుక బట్టీల్లో 4200 కార్మికులుగా ఉన్నట్లు అధికారిక లెక్కలు. కాగా, మరో 4 లక్షల మంది ప్రతి రోజూ వివిధ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

లాక్‌డౌన్ తర్వాత ఏంటి పరిస్థితి ?

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ తరువాత తమ భవితవ్యం ఎలా ఉంటుందో అనే భయం కార్మికులను వెంటాడుతోంది. లాక్‌డౌన్ కారణంగా చాలా వరకు చిన్న తరహా పరిశ్రమలతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ తరుణంలో చాలామంది ఆర్థికంగా తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ నష్టాలు కొంతమేర తగ్గాలంటే ఉన్న సిబ్బందిలో కోతలు తప్పవనే భావన ఇప్పటికే వెలువడుతోంది. ఇప్పటికే పలువురు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోగా.. మరికొంత మంది కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలు చేయాలనే యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతుండగా.. ఇప్పటికే అనధికారికంగా 10 గంటల పాటు పని చేస్తున్న తమపై.. ఈ నిర్ణయంతో మరింత భారం పడుతుందని వారు మండిపడుతున్నారు. కావున లాక్‌డౌన్ తరువాత ఎంత మంది కార్మికులు రోడ్లపైకి రావాల్సి వస్తుందో అనే భయం కార్మికుల్లో వ్యక్తం అవుతోంది.

దేశ ఆర్థిక పురోగతికి వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల్లో రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న కార్మికుల పట్ల పాలకులు, పారిశ్రామికవేత్తలు ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణి వీడాలి. లేకుంటే మే డే స్ఫూర్తితో మరొక్కసారి ప్రపంచ కార్మికులు ఏకమయ్యే పరిస్థితులు భవిష్యత్‌లో తలెత్తే అవకాశం లేకపోలేదు.

Tags : May day, Labour, Unions, lockdown, Labour Act, Industrialists

Advertisement

Next Story

Most Viewed