- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ల కష్టాలు.. కక్కలేక.. మింగలేక..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న ప్రతి భూ సమస్యను కలెక్టరే పరిష్కరించాలి. వారు దస్త్రం చూసి ఓకే చెబితే తప్ప తహసీల్దార్ ఏమీ చేయలేరు. కలెక్టరేట్ నుంచి ఆమోదించినట్లు సమాచారం వస్తే గానీ సంతకం చేయరు. కానీ, ప్రతి చిన్న సమస్యకు కలెక్టర్‌నే బాధ్యుడిని చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీఆర్వో చేయాల్సిన డ్యూటీని తమతో చేయిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాయాల్సిన రిపోర్టు కాపీ విషయంపై తామే క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తే తప్ప నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఇలా ప్రతి కేసునూ కలెక్టర్ సాల్వ్ చేయాలంటే పార్ట్ బీ సమస్యల పరిష్కారానికి ఎన్ని ఏండ్లు పడుతుందో తెలియదు.
ఈ విషయమే ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో హాట టాపిక్‌గా మారింది. ఈ బాధ్యతల నుంచి తమను సైతం తప్పిస్తే బాగుంటుందని కలెక్టర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అదనపు బాధ్యతలు తమకొద్దని సీఎస్‌ను కోరాలని భావించారు. కానీ తమ అభిప్రాయం చెప్పాక ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే చర్చ రావడంతో వారు సైలెంట్ అయినట్టు సమాచారం. గతంలో, ఇప్పటి జాబ్‌చార్ట్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సమస్యలను త్వరగా పరిష్కరించడం లేదన్న నింద తమపై పడుతుందని జిల్లా బాస్‌లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ధరణి పోర్టల్, పెండింగ్ఫైళ్ల పరిష్కారానికి మరో ప్రత్యామ్నాయ మార్గం చూడకుంటే దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రమవుతుందని ఓ అధికారి చెప్పుకొచ్చారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే వాటిని సైతం కలెక్టర్ చేతిలో పెట్టడం ద్వారా మరింత జాప్యం జరుగుతుందన్న వాస్తవాన్ని చీఫ్‌సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లేందుకు సాహసించడం లేదని అభిప్రాయపడ్డారు.
టైం మొత్తం ట్రిబ్యునల్‌కే
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులోని 16,943 ఆర్వోఆర్ కేసుల పరిష్కారానికే కలెక్టర్లు టైం కేటాయిస్తున్నారు. నెలకు పైగా దస్త్రాలు చూడడం, తహసీల్దార్లతో రిపోర్టులు తెప్పించుకోవడంతోనే సరిపోయింది. ప్రస్తుతం తీర్పులు ఎలా ఇవ్వాలన్న అంశంపైనే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తహశీల్దార్, కలెక్టర్ ఆఫీసులన్నీ ట్రిబ్యునల్పరిధిలోని ఆర్వోఆర్ కేసుల పరిష్కారానికి సమయమంతా వెచ్చిస్తున్నట్టు తెలిసింది. ఇక మిగతా పెండింగు కేసుల జోలికే వెళ్లలేదు. ఎలాంటి ఆర్డర్లు ఇస్తే ఏమవుతుందోనన్న అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం.
ఎలాగూ 90 శాతానికి పైగా కేసుల్లో దరఖాస్తుదారులను కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలన్న సూచనలతోనే ఉండే అవకాశం ఉన్నట్టు రెవెన్యూ వర్గాల సమాచారం. అదే నిజమైతే కోర్టుకు వెళ్లే కేసుల్లో తహసీల్దార్లకు బదులుగా తీర్పు వెలువరించిన కలెక్టర్లను సైతం పార్టీలుగా చేసేందుకు ఛాన్స్ ఉంది. అప్పుడు ఇవే కేసుల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరిగే బాధ్యత సైతం కలెక్టర్ల పైనే పడుతుందని రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఇచ్చిన ఆదేశాలేవీ చెల్లుబాటు కావని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కలెక్టర్లపై ఒత్తిడి అధికమవుతోంది.
పేదలకు న్యాయం ప్రశ్నార్ధకమే?
తమకు న్యాయం చేయాలంటూ తెల్ల కాగితం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేస్తే సరిపోయేది. అక్కడే న్యాయం పొందొచ్చన్న విశ్వాసం బాధిత రైతుకు ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ రైతును కోర్టుకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని ఆదేశిస్తే అతనికి న్యాయం జరగడం ప్రశ్నార్ధకంగా మారుతుందని భూ చట్టాల నిపుణుడు, నల్సర్యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ అభిప్రాయపడ్డారు. న్యాయవాదిని నియమించుకొని కోర్టుకు వెళ్లేంత స్థాయి పేదలకు లేదని, ఇప్పుడు ట్రిబ్యునళ్ల ద్వారా తీర్పులను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లే పేద రైతుల సంఖ్య 10 శాతం సైతం ఉండదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం పొందేందుకు ప్రభుత్వం కనీసం పారా లీగల్ వ్యవస్థనైనా ఏర్పాటు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏపీలోనూ 33 వేల ఆర్వోఆర్ కేసులు వివిధ స్థాయిలో నిలిచిపోయాయని తెలిపారు. ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదు. నేటికీ ఆర్డీఓ, జేసీ కోర్టుల్లో వాదనలు నడుస్తున్నాయని, నెలలో 16 వేల కేసులను పరిష్కరించామని గొప్పలు చెప్పుకోవడానికే అది పనికొస్తుందని నిపుణులు విమర్శిస్తున్నారు. కేసులు డిస్పోజ్ చేస్తే న్యాయం చేసినట్టు కాదని, టేబుల్ క్లీన్ అవుతుందేమో కానీ సమస్య పరిష్కారం అయినట్టు కాదని చెబుతున్నారు. డిస్పోజల్ ఈజ్ నాట్ కరెక్ట్. రీడ్రెసెల్మెకానిజం ఉండాలని సూచిస్తున్నారు. ఇక నుంచి చిన్న సమస్యకు సైతం కోర్టుకే వెళ్లి పరిష్కరించుకోవాలన్న ప్రభుత్వ నిబంధన పేద రైతుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.