‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం ప్రత్యేక గది

by  |
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం ప్రత్యేక గది
X

దిశ, వెబ్‌డెస్క్ : జనతా కర్ఫ్యూ నుంచి మొదలు.. ఆరు నెలలుగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫెసిలిటీని కల్పించాయి. అయితే, ఆఫీస్‌లో పని చేయడం వేరు, ఇంట్లో పనిచేయడం వేరు. ఆఫీస్ వాతావరణం.. పనిచేసేందుకు అనువుగా ఉంటుంది. కానీ ఇంట్లో అసలు అలాంటి వాతావరణమే కనిపించదు. ఒకవేళ ఏదైనా గదిలో ఆఫీస్ సెటప్ ఏర్పాటు చేసుకున్నా.. టీవీ శబ్దాలు, పిల్లల అరుపులు ఆఫీస్ పనిని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అందుకే జపాన్‌లోని ఓ కంపెనీ.. బయటి శబ్దాలు లోపలికి వినిపించకుండా ఓ చిట్టి పొట్టి గదిని తయారుచేసింది. పూర్వం టెలిఫోన్ బూత్‌ను తలపిస్తున్న ఆ గదిలోకి మనమూ వెళ్లొద్దాం రండి!

ప్రస్తుతం ఇండియాలోనే కాదు.. చాలా దేశాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కల్చర్ నడుస్తోంది. కరోనా ఉన్నా, లేకపోయినా.. దాదాపు చాలా సంస్థలు డిసెంబర్ వరకు తమ ఉద్యోగులకు ఈ ఫెసిలిటినీ అందించనుండగా.. మరికొన్ని కంపెనీలు వచ్చే ఏడాదిలో కూడా ఈ కల్చర్‌ను కొనసాగించనున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు.. ఉద్యోగులకు అవసరమయ్యే పరికరాలను రూపొందించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన సౌండ్ ప్రూఫింగ్ కంపెనీ ‘పియా లివింగ్’.. ‘ఒటెగారూమ్’ అనే చిన్ని గదులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఒటెగారు అంటే.. చీప్ లేదా సింపుల్ అని అర్థం, రూమ్ అంటే గది. వీటిని చూస్తే.. పూర్వం పబ్లిక్ ప్లేసుల్లో ఉండే ‘ఫోన్ బూత్’లు గుర్తుకొస్తాయి. అయితే, ఇది పూర్తిగా సౌండ్ ఫ్రూఫ్‌తో రూపొందించిన గది. వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇంట్లో కొద్దిపాటి ప్లేస్‌లోనే వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు.

చూడటానికి చిన్ని గదే కానీ, ఇందులో.. కంఫర్ట్‌‌గా కూర్చోవడానికి ప్లేస్‌తో పాటు లైటింగ్, వెంటిలేషన్ ఫ్యాన్, కంప్యూటర్ టేబుల్ వంటి సౌకర్యాలతో అనువుగా ఉంటుంది. గదిలోకి శబ్దాలు రాకుండా ఉండేందుకు ‘శాండ్‌విచ్’ బోర్డులను ఉపయోగించారు. 15 డెసిబుల్స్ వరకు ఇవి సౌండ్‌ను రాకుండా అడ్డుకోగలవు. ఈ గదులు మొత్తంగా 50 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. వీటి ధర రూ. 1.37 లక్షలు. ఇవి ఆంటిక్ వైట్, బిట్టర్ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలాంటి నాయిస్ పొల్యుషన్ లేకుండా.. గిటార్ ప్లే చేసుకోవచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, జూమ్ మీటింగ్ కాల్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యపీగా అటెండ్ కావచ్చు. సూపర్ కదా!


Next Story