నమ్మించి రూ.4 కోట్లు ముంచిన కి‘లేడీ’..!

by  |
నమ్మించి రూ.4 కోట్లు ముంచిన కి‘లేడీ’..!
X

దిశ, వెబ్‌డెస్క్: అమాయక మహిళలే ఆమె టార్గెట్. పెట్టుబడులు పెడితే రూ. లక్షల్లో కమిషన్ వస్తుందని నమ్మిస్తుంది. దీంతో ఆ లేడీని నమ్మి పెట్టుబడులు పెడితే మొదట్లో కమిషన్ కూడా ఇస్తోంది. రెండు, మూడు నెలల అ తర్వాత ఆమె అసలు స్వరూపం బయటకు వస్తోంది. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లాలో 15 మందికి రూ.4కోట్లు కుచ్చుటోపి పెట్టిన ఆ కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్‎కు చెందిన ఆకుల స్వాతి టప్పర్ వేర్ (ప్లాస్టిక్ తరహా డబ్బాలు) వ్యాపారం చేసేది. ఈ క్రమంలో పలువురి మహిళలకు తాను చేస్తున్న వ్యాపారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30వేల కమిషన్ వస్తుందని నమ్మబలికింది. దీంతో యాటకన్నారెడ్డి కాలనీకి చెందిన మానస రూ.కోటి 30 లక్షలు, యాట భారతమ్మ రూ.19 లక్షలు స్వాతికి పెట్టుబడిగా ఇచ్చారు. ఇలా 15 మంది మహిళల నుంచి రూ.4 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే వరుసగా రెండు నెలల పాటు కమిషన్ డబ్బులు ఇచ్చి అనంతరం ఇవ్వడం మానేసింది.

ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టిన మహిళలు డబ్బులు అడుగుతుండడంతో మీరు ఇచ్చినట్టు కాగితాలు రాసుకున్నామా అంటూ ఎదురు తిరిగింది. దీంతో బాధితులంతా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‎రెడ్డిని ఆశ్రయించారు. బాధిత మహిళలతో కలిసి ఎమ్మెల్యే వచ్చి జిల్లా ఎస్పీ రంగనాథ్‎కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిని అరెస్ట్ చేశారు. స్వాతి మోసాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టాస్క్‎ఫోర్స్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం వారు బాధితుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.


Next Story

Most Viewed