జేసీబీతో కరోనా అనుమానితురాలి అంత్యక్రియలు

by  |
జేసీబీతో కరోనా అనుమానితురాలి అంత్యక్రియలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా సోకిన వారిపై ఈ సమాజంలో జరుగుతున్న అమానుష ఘటనలు రోజుకోచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ సోకకపోయినప్పటికీ అనుమానితురాలు, అనారోగ్యంతో మృతిచెందితే అంత్యక్రియలకు నలుగురు కూడా ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు, జేసీబీ సహాయంతో ఖననం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…

ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌ గ్రామంలో తలారి సత్తమ్మ కుమారుడికి కరోనా సోకి ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ పరీక్షలు చేయించుకోగా, అందరికీ నెగిటివ్ వచ్చింది. అనంతరం తీవ్ర అనారోగ్యంతో సత్తమ్మ మంగళవారం చనిపోగా, ఆమె కరోనా కారణంగానే చనిపోయి ఉంటుందన్న అనుమానంతో ఎవరూ, అంత్యక్రియలకు హాజరుకాలేదు.

కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, కులస్థులు ఎవరూ కూడా దరిదాపులకు కూడా వెళ్లలేదు. దీంతో చివరకు చేసేది ఏమీ లేక సత్తమ్మ కుమారుడే పీపీఈ కిట్ ధరించి మృతదేహాన్ని ఎత్తుకుని జేసీబీ ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసి పలువురు కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed