అమ్మ కోసం.. 15 అడుగుల బావి

‘మౌంటైన్ మ్యాన్’ అని పిలిచే దశరథ్ మాంజీ గురించి చాలా మందికి తెలుసు. తన భార్య గుర్తుగా తన దగ్గరి ఉలి, సుత్తెతో ఒక పెద్ద కొండను తవ్వి దారి నిర్మించాడు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాకు చెందిన బొబితా సోరెన్‌ కూడా అలాంటి పనే చేసింది. తల్లి కోసం ఒంటరిగా తన ఇంట్లోనే 15 అడుగుల బావి తవ్వింది. తన 50 ఏళ్ల తల్లి ‘నీనా సోరెన్’ నీళ్ల కోసం రోజుకి రెండు మూడు సార్లు 200 మీటర్ల దూరం వెళ్లి, ప్రతిసారీ అరగంట పాటు వరుసలో నిలబడటం చూసి బొబితా తట్టుకోలేకపోయింది. ఎనీమియాతో బాధపడుతున్న నీనా తమను పెంచడానికి చిన్నప్పటి నుంచి పడుతున్న కష్టాన్ని చూసిన బొబితా, ఇంట్లోనే బావి తవ్వి నీళ్ల విషయంలో ఆమె కష్టాన్ని తీర్చాలనుకుంది. 2019లో బావి తవ్వడానికి ఇంట్లోనే ఒక చోటు చూసుకొని పని మొదలుపెట్టింది.

పొలిటికల్ సైన్సులో ఎంఏ చేసి, ప్రస్తుతం బీఈడీ చేస్తోన్న బొబితా చదువు కోసం హాస్టల్‌లో ఉంటోంది. అందుకే సెలవుల్లో ఇంటికి వచ్చినపుడు మాత్రమే బావి తవ్వడానికి సమయం దొరికేది. కానీ లాక్‌డౌన్ పుణ్యమాని బావి తవ్వడానికి సరిపడా టైమ్ దొరికింది. రోజూ ఇంటి పనులు పూర్తవగానే బావి తవ్వడం మొదలుపెట్టి వీలైనంత వరకు తవ్వేది. లోతు పెరుగుతున్నకొద్దీ లోపలి మట్టి తీయడానికి తండ్రి, అన్నయ్య, సోదరి సాయం చేసేవాళ్లు.

ఎట్టకేలకు 15 అడుగుల లోతుకి తవ్విన తర్వాత ఆ బావిలో నీళ్లు ఊరడంతో బొబితా ఆనందానికి అవధుల్లేవు. బొబితా సాధించిన విజయం ఒక్క రోజులోనే పశ్చిమ బెంగాల్ మొత్తం తెలిసింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే తపస్ బెనర్జీ నేరుగా వచ్చి బొబితా తవ్విన బావిని చూసి అభినందించారు. అంతేకాకుండా అధికారులతో మాట్లాడి మరో 15 అడుగులు తవ్విస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బొబితాకు ఒక ల్యాప్‌టాప్, ఉద్యోగం కూడా ఇస్తామని మాటిచ్చారు.

Advertisement