ఒకే రోజు 43 మంది.. కరోనా మృతుల్లో రికార్డు !

by vinod kumar |   ( Updated:2020-04-18 11:25:20.0  )
ఒకే రోజు 43 మంది.. కరోనా మృతుల్లో రికార్డు !
X

– రోజుకు వెయ్యి చొప్పున పెరుగుతున్న పాజిటివ్ కేసులు

దిశ, న్యూస్ బ్యూరో: గత రెండు వారాలుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లుగానే.. కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అత్యధిక స్థాయిలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. ఇప్పటివరకు ఒకే రోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో చనిపోవడం ఇదే ప్రథమం. మృతుల్లో దాదాపు 75% మంది అరవై ఏళ్ళ పైబడినవారే. మొత్తం పాజిటివ్ పేషెంట్లలో చనిపోతున్నవారి రేటు సగటున 3.3% ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ అంచనా వేసింది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయానికి దేశం మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 14,792కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 957 మంది కొత్త పేషెంట్లు పుట్టుకొచ్చారు. మొత్తం మృతుల సంఖ్య 488కు చేరుకుంది. డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 2014 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలోకెల్లా కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో 3648 కేసులుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలో సైతం కరోనా పేషెంట్ల సంఖ్య వెయ్యి దాటే అవకాశం ఉంది. వారం రోజులుగా నమోదవుతున్న కొత్త కేసుల్ని చూస్తే ఇదే తీరులో పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటిదాకా దేశం మొత్తం మీద నమోదైన పాజిటివ్ కేసుల్లో 4291 కేసులకు మూలం మర్కజ్ యాత్రేనని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విశ్లేషణలో తేలింది. ప్రతీ పది మందిలో ముగ్గురికి ఈ యాత్ర ద్వారానే వైరస్ సోకినట్లు అంచనా వేసింది. ఢిల్లీలో గుర్తించిన 1700కు పైగా పాజిటివ్ కేసుల్లో సుమారు 63% మర్కజ్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నట్లు విశ్లేషించింది. తమిళనాడులో ఇది 84% ఉండగా, తెలంగాణలో 79% మేర ఉన్నట్లు తేలింది. చికిత్స అనంతరం కోలుకుంటున్నవారి రేటు సగటున 14% మేర ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఆరు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు :

భారత్ :

మొత్తం కేసులు : 14,792

మృతులు : 488

రికవరీ : 2014

తెలంగాణ :

మొత్తం కేసులు : 809

మృతులు : 18

రికవరీ : 186

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు :603

మృతులు : 16

రికవరీ : 42

Tags : Corona, Last 24 hours, Markaz, Record deaths, Maharashtra

Advertisement

Next Story