మహిళల సింగిల్స్ చాంపియన్.. ఆష్ బార్టీ

by Shyam |
మహిళల సింగిల్స్ చాంపియన్.. ఆష్ బార్టీ
X

దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ 2021 మహిళా సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ 1, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్ బార్టీ నిలిచింది. శనివారం సాయంత్రం సెంటర్ కోర్టులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7(4-7), 6-3 తేడాతో విజయం సాధించి వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నది. మ్యాచ్ ప్రారంభంలో ఆష్ బార్టీ దూకుడుగా ఆడింది. తొలి సెట్‌లో వరుసగా ప్లిస్కోవా సర్వీస్ బ్రేక్ చేసి 4-0 ఆధిక్యానికి దూసుకొని వెళ్లింది. కానీ ఆ తర్వాత ప్లిస్కోవా కాస్త పోరాడింది. అయినా సరే బార్టీ ఆ సెట్‌ను 6-3తో కైవసం చేసుకున్నది. ఇక రెండో సెట్‌లో మాత్రం ప్లిస్కోవా తన మైండ్ గేమ్‌తో బార్టీని చాలా ఇబ్బంది పెట్టింది. రెండో సెట్ సొంత సర్వీస్‌లోనే బార్టీ చాంపియన్‌షిప్ పాయింట్లు వచ్చే అవకాశం ఉన్నా.. ప్లిస్కోవా తన ఆటతో టై బ్రేకర్ వరకు తీసుకొని వెళ్లి.. ఆ తర్వాత రెండో సెట్ గెలిచింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో మాత్రం బార్టీ ఎలాంటి తప్పులు చేయలేదు. మరోసారి ప్లిస్కోవా సర్వీస్ బ్రేక్ చేస్తూ దూసుకొని వెళ్లింది. మూడో సెట్‌ను సునాయాసంగా 6-3తో గెలిచి వింబుల్డన్ 2021 మహిళా చాంపియన్‌గా అవతరించింది. 2012 తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మూడో సెట్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

ఆష్ బార్టీకి ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అంతకు ముందు 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచింది. కాగా, వింబుల్డన్‌లో మహిళల విజేతగా నిలిచిన మూడో ఆస్ట్రేలియన్‌గా బార్టీ రికార్డు సృట్టించింది. అంతకు ముందు మార్గరెట్ కోర్ట్, ఇవానే గూలగోంగ్ వింబుల్డన్ గెలిచారు. అయితే 1980లో గూలగోంగ్ మహిళల టైటిల్ గెలిచిన తర్వాత 41 ఏళ్లకు ఆష్ బార్టీ విజేతగా నిలవడం గమనార్హం.

ఆష్ బార్టీ తొలి రౌండ్‌లో కార్లా సురెజ్‌ను ఓడించింది. ఆ తర్వాత అన్నా బ్లింకోవా, కేథరీనా సినియాకోవాపై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరింది. బార్బారా క్రెజికోవాను ప్రీ క్వార్టర్స్‌లో ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. ఇక క్వార్టర్స్‌లో అజ్లా టామ్‌జనోవిచ్, సెమీస్‌లో ఆంజిలిక్ కెర్బర్‌పై గెలిచి ఫైనల్ చేరింది.

‘నేను ఇవానే గౌరవాన్ని కొనసాగిస్తున్నానని అనుకుంటున్నాను. ఈ విజయం చాలా అద్భుతమైనది’ అని ఆష్ బార్టీ అన్నది.

Advertisement

Next Story

Most Viewed