ఈ నెలలోనైనా పూర్తి జీతం వచ్చేనా?

by  |
ఈ నెలలోనైనా పూర్తి జీతం వచ్చేనా?
X

దిశ, న్యూస్ బ్యూరో: వరుసగా రెండు నెలలుగా పాక్షిక జీతంతో సరిపెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు జూన్ నెలలో అందుకునే మే నెల జీతం పూర్తిస్థాయిలో వస్తుందని కొండంత ఆశతో ఉన్నారు. ఉద్యోగుల పే రోల్స్ సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం పూర్తి జీతం ఇస్తుందా లేక పాక్షిక జీతంతోనే సరిపెడుతుందా అనేది బహిర్గతం కాలేదు. నెలాఖరు దగ్గర పడుతుండటంతో పూర్తి జీతం వస్తుందనే ఆశ ఉన్నా బ్యాంకు ఖాతాలో పడేంత వరకూ సస్పెన్స్‌గానే ఉంది. ఇప్పటికే రెండు నెలలు సగం జీతం తీసుకున్న ఉద్యోగులు ఈసారి పూర్తి వేతనాన్నిఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని, ఈ నెలలోనైనా పూర్తి జీతాలు చెల్లించాలని ప్రధాన కార్యదర్శిని కోరారు.

ఏపీ ప్రభుత్వం పూర్తి జీతాలు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి జీతం ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని ప్రతీరోజు తెలుసుకుంటున్నారు. కానీ, అలాంటి ఆశాజనకమైన సమాచారం వీరికి అందడంలేదు. ఇప్పటికే రెండు నెలలు సగం జీతాలు తీసుకున్నామని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత కోత పెట్టిన జీతాలు కూడా చెల్లించాలని అడిగారు. కానీ, జూలై వరకు వేచి చూడాల్సిందేనని సూటిగానే సమాధానం వచ్చింది.

ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ ఉద్యోగుల ఒక్క నెల పూర్తి వేతనాల కోసం దాదాపు రూ.1200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పన్నుల వాటాగా రూ.982 కోట్లు విడుదల చేసింది. అబ్కారీ, రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ నుంచి వచ్చే ఆదాయం ఎంతో కొంత సర్దుబాటు చేద్దామనుకున్నా అత్యవసర పనులకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ శాఖల నుంచి వచ్చే ఆదాయం మిగలడం లేదని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులున్నీ పూర్తి చేశారు. అయితే సీఎం నుంచి ఆదేశాలు రాగానే పూర్తి వేతనమా.. సగం వేతనమా స్పష్టం కానున్నట్లు చెబుతున్నారు.



Next Story