- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ నెలాఖరుకు కరోనా ఖతం కావడం ఖాయమా?
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో ప్రతిరోజూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జూలై మొదటి పది రోజుల వరకూ దాదాపు 90 శాతం మేర ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యేవి. ఆ తర్వాత క్రమంగా పక్కనున్నరంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెరుగుతూ ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలోని అధికారిక గణాంకాలను చూస్తే మొత్తం కేసుల్లో 30% కంటే తక్కువే నగరంలో నమోదవుతున్నాయి. మరోవైపు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసుల్ని ప్రామాణికంగా తీసుకున్న రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈ నెలాఖరు కల్లా కరోనా వైరస్ నగరంలోఖతమవుతుందని, ఆ తర్వాత మరో నెల రోజుల్లో జిల్లాల్లోనూ తగ్గిపోతుందని పేర్కొంది. నగరంలో వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణమేంటి? ప్రభుత్వం అనుసరించిన వ్యూహమేంటి? అది ఆశించిన ఫలితాలు ఇచ్చిందని భావిస్తే అదే వ్యూహం జిల్లాల్లో అమలవుతోందా? ఇదే వ్యూహం అక్కడ కేసుల్ని ఎందుకు తగ్గించలేక పోతోంది? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశాలయ్యాయి.
హైదరాబాద్‌లో జూలై మొదటి పది రోజుల్లో సగటున 1500 చొప్పున (మొత్తం కేసుల్లో 80%-90%) నమోదయ్యాయి. మొదటి నుంచీ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో హైదరాబాద్ నగరంలో ఉండేవే సింహభాగం. జూలై 3వ తేదీన రాష్ట్రంలో మొత్తం 1,892 కేసులు నమోదైతే అందులో 1,658 ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. గత నెల 8వ తేదీ వరకూ దాదాపుగా 1500 చొప్పున కేసులు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాతి రోజు నుంచీ వెయ్యి లోపే నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు అది 500 కంటే తగ్గిపోయింది. కానీ అదే సమయంలో పక్కనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో తగ్గుతున్నకేసులు పక్కనే ఉన్న జిల్లాల్లో పెరుగుతుండడం వైద్య సిబ్బందిలోనే సందేహాలను రేకెత్తించింది. జూలై 9వ తేదీ నుంచి ఇప్పటివరకు వెయ్యి కంటే ఎక్కువ కేసులు నగరంలో నమోదైనట్లు బులెటిన్‌లో ఎప్పుడూ కనిపించలేదు.
వైద్యారోగ్య కార్యదర్శి బదిలీతో మార్పు మొదలు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని గత నెల 16న బదిలీ చేసే సమయానికి కూడా నగరంలో దాదాపు 900 కేసుల వరకూ ప్రతిరోజూ నమోదవుతూ ఉన్నాయి. ఆమె బదిలీ తర్వాత కొత్తగా కార్యదర్శిగా రిజ్వీ బాధ్యతలు తీసుకోవడంతో బులెటిన్ ఫార్మాట్‌లో మార్పులు మొదలయ్యాయి. దీంతో నగరంలో కరోనా కేసుల సంఖ్యలో కూడా తేడా ప్రస్ఫుటంగా కనిపించింది. జూలై 19వ తేదీ నుంచి నగరంలో నమోదయ్యే కేసుల సంఖ్య కొన్ని రోజుల పాటు 500 చిల్లరకు మాత్రమే పరిమితమైంది. మధ్యలో రెండు మూడు రోజులు 600 మార్కు దాటినా జూలై 26 నుంచి మాత్రం 600 కంటే మించడం లేదు. టెస్టుల సంఖ్య కూడా అప్పటివరకూ పది వేల లోపే ఉండేది. పాజిటివిటీ రేటు 15%గా ఉండేది. కానీ జూలై 27 నుంచి ఒక్కసారిగా టెస్టుల సంఖ్య పెరగడం, పాజిటివిటీ తగ్గడం మొదలైంది. అదే సమయంలో జిల్లాల్లో కేసులు పెరగడం, హైదరాబాద్‌లో తగ్గడం బులెటిన్‌లలో కనిపించింది. జూలై మాసం తొలి పది రోజుల్లో సగటున 80%-90% మధ్య ఉన్న హైదరాబాద్ నగరంలోని కేసుల తీవ్రత నెలాఖరుకల్లా సగానికి తగ్గి 40 శాతానికే పరిమితమైంది. తాజాగా ఆగస్టు 8వ తేదీ నాటికి అది మరింతగా తగ్గి కేవలం 20 శాతానికే పరిమితమైంది.
తగ్గుతున్నాయా? తగ్గిస్తున్నారా?
నగరంలో నిజంగా కరోనా ఉధృతి తగ్గితే అంతకన్నాసంతోషం లేదు. కానీ వాస్తవికంగా నమోదవుతున్న కేసుల్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపుతోందన్న విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. హైకోర్టు సైతం బులెటిన్‌లోని గణాంకాల పట్ల విస్మయం వ్యక్తం చేసింది. విపక్ష సభ్యులు కూడా ఈ గణాంకాలను తప్పుబట్టారు. దానికి సమాధానంగా మంత్రులు, అధికారులు కూడా ‘కేసుల్ని తగ్గించి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికేముంటుంది? అలా తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏముంది? కేసుల్ని, మరణాల్ని దాచిపెట్టడం సాధ్యమేనా?” అంటూ వ్యాఖ్యానించారు. మరణాల విషయంలో ప్రభుత్వం బులెటిన్‌లో చెప్తున్న లెక్కలకూ, ఆసుపత్రుల్లో నమోదవుతున్న మరణాల సంఖ్యకూ చాలా తేడా అనేక సందర్భాల్లో కనిపించింది. కరోనా కేసుల విషయంలోనూ జిల్లాల్లోని వైద్యారోగ్య శాఖ అధికారులు ఇచ్చే బులెటిన్ వివరాలకూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి బులెటిన్‌లో కనిపించే లెక్కలకూ చాలా తేడా ఉంది.
ఈ అంశాలన్నింటినీ వేలెత్తి చూపడాన్ని సహించలేకపోయిన ప్రభుత్వం జిల్లా స్థాయి బులెటిన్‌లను నిలిపి వేయించింది. ఇప్పటికీ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఎంత మంది కరోనా కారణంగా చనిపోయారు. ఎన్ని ర్యాపిడ్ టెస్టులు జరిగాయి.. ఇలాంటి వివరాలేవీ జిల్లా అధికారులు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించదు, బులెటిన్‌లో ఇవ్వదు. దాపరికం అవసరం లేదంటూనే వాస్తవాలు, అవసరమైన వివరాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధపడడం లేదు. హైదరాబాద్‌లో అవలంబించిన వ్యూహం కారణంగానే వైరస్ వ్యాప్తి తగ్గిపోయి పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం చెప్పేది నిజమే అయితే ఇదే వ్యూహాన్ని జిల్లాల్లోనూ అమలుచేసి తగ్గించవచ్చుగదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ జిల్లాల్లో మాత్రం కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శనివారం ఇచ్చిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటే ఇకపైన జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీ రాష్ట్ర బులెటిన్‌లలో తగ్గుతుందనేది స్పష్టమవుతోంది.
మరోవైపు కేసులు పెరుగుతాయన్న ఉద్దేశంతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్లను, హోమ్ ఐసొలేషన్ కిట్లను ప్రభుత్వం భారీ సంఖ్యలో సమకూర్చుకుంటూ ఉంది. ఇప్పటికే ఐదు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోగా, ఇంకో పది లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చింది. హోమ్ ఐసొలేషన్ కిట్లను ఇప్పటికే సుమారు 86 వేలను సిద్ధం చేసింది. ఏరియా ఆసుపత్రుల్లో సైతం ఆక్సిజన్ సౌకర్యాన్ని సమకూరుస్తూ ఉంది. లక్షల సంఖ్యలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను, రెమిడెసివిర్ ఇంజెక్షన్లను జిల్లాలకు పంపుతోంది. ఒకవైపు సెప్టెంబరుకల్లా కరోనా వైరస్ ఖతం అవుతుందని చెప్తూనే మరోవైపు భారీ స్థాయిలో బెడ్‌లను, మాత్రలను, కిట్లను సమకూర్చుకుంటోంది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమేనా?
హైదరాబాద్ నగరంలో నమోదవుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు కూడా ఉన్నాయి. నగరంలోని వైరస్ వ్యాప్తిని, ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో హైదరాబాద్‌లో నమోదైనవి, ప్రతిరోజూ వస్తున్న కేసులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ నగరాన్ని కూడా ఎక్కువ తీవ్రత ఉన్న జిల్లాల జాబితాలో చేర్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ నగరంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అందుకు నిదర్శనమే 500 కంటే తక్కువ సంఖ్యలో నమోదవుతుండడం అని వ్యాఖ్యానిస్తోంది.
హైదరాబాద్ నగరంలో ఉన్న ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాష్ట్రంలోని మొత్తం స్వీయ ఆదాయ వనరుల్లో సుమారు 60% హైదరాబాద్ నగరం నుంచే రావడం.. ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగానే కేసుల సంఖ్యను తగ్గించి చూపుతోందన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి వైరస్ లేదన్న ఒక సాధారణ అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం ద్వారా వలస వెళ్లినవారంతా తిరిగి రావడం, రోజువారీ కార్యకలాపాలు యథాతథ స్థితికి చేరుకోవడం, ఎన్నికల సమయానికి ఓటు హక్కు వినియోగించు కోవడానికి కరోనా భయం లేని పరిస్థితిని సృష్టించడం.. ఇవన్నీ ముందుచూపుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యూహంలో భాగమనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
‘పీక్’కు వెళ్లిన తర్వాత దానంతట అదే తగ్గుతుంది: డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ
రాష్ట్రంలో నమోదయ్యే కరోనా కేసుల్లో గతంలో హెచ్చుశాతం హైదరాబాద్ నగరంలోనే ఉండడం నిజమే. కానీ ఒక పీక్ స్థాయికి వెళ్లిన తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, టెస్టుల సంఖ్య పెంచిన తర్వాత వస్తున్న మార్పులన్నింటినీ విశ్లేషిస్తున్నాం. అన్‌లాక్ తర్వాత ప్రజలు రోడ్లమీదకి రావడం, కేసుల సంఖ్య పెరగడం కూడా చూశాం. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఈ పరిణామాన్ని విశ్లేషించిన తర్వాతనే ఈ నెల చివరి కల్లా వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వస్తుందని అంచనా వేశాం. కొత్త కేసులు పుట్టడం ఇంకా తగ్గిపోతుందనే ధీమాతో ఉన్నాం.