‘నిర్భయ’ దోషులకు ఉరి అమలయ్యేనా?

by Shamantha N |
‘నిర్భయ’ దోషులకు ఉరి అమలయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నిర్భయ దోషులకు రేపు ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలవుతుందా? లేక ఇదివరకు రెండు సార్లు వాయిదా పడినట్టే మళ్లీ.. వాయిదా పడుతుందా? సోమవారం ఈ కేసుకు సంబంధించి జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో ఈ సందేహాలు ముందుకొస్తున్నాయి. ‘నిర్భయ’ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం, అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను పవన్ గుప్తా క్షమాభిక్ష కోరడం.. ఇదే సమయంలో ట్రయల్ కోర్టు… ఈ దోషులకు జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించడం వంటి అంశాలు రేపు ఉదయం.. దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మలకు ఉరి పడుతుందా? అనే విషయంపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా.. దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ తీర్పు వెంటనే.. పవన్ గుప్తా తరఫు న్యాయవాది మెర్సీ పిటిషన్‌ సమర్పించడం దాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడం చకచకా జరిగిపోయాయి.

సుప్రీంకోర్టులో మెర్సీ పిటిషన్ విచారణలో ఉన్నదని పవన్ గుప్తా, రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నదని అక్షయ్ ఠాకూర్‌లు చెబుతూ.. డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరారు. కానీ, ట్రయల్ కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే తీహార్ జైలులో ఉరి అమలుకు సన్నాహాలు జరుగుతన్నాయి.

సుప్రీంకోర్టు పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ తోసిపుచ్చడంతో నలుగురు దోషులకు కోర్టుముందున్న అవకాశాలు పరిసమాప్తమయ్యాయి. పటియాల కోర్టు ప్రకారం.. రేపు నలుగురికి ఉరి పడాల్సిందే. కానీ, రాష్ట్రపతి క్షమాభిక్షను కొట్టివేశాక 14 రోజుల తర్వాతగానీ ఉరి తీయరాదు. దీంతోపాటు, దోషులను వేర్వేరుగా ఉరితీసే అవకాశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. దీనిపై 5వ తేదీన విచారణ ఉన్నది. ఇదిలా ఉండగా.. పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును పై న్యాయస్థానాల్లోనూ సవాల్ చేసేందుకు దోషుల తరఫు న్యాయవాదులు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటువంటి న్యాయపరమైన అంశాల దృష్ట్యా రేపు ఉదయం ఈ నలుగురికి ఉరి శిక్ష అమలు జరగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags : nirbhaya case, hang, convicts, legal remedies, mercy petition, death warrant

Advertisement

Next Story

Most Viewed